AP Cabinet: ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే

www.mannamweb.com


తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌
24 మందితో మంత్రుల జాబితా
జనసేన నుంచి ముగ్గురు, భాజపా నుంచి ఒకరు
ముగ్గురు మహిళలకు చోటు
నేడు 11.57కు ప్రమాణ స్వీకారం

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఉపముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులూ ప్రమాణం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఉంటారు. పవన్‌ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక 1.15 గంటల సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. జనసేనకు మూడు, భాజపాకు ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికిపైగా కొత్తవారికి అవకాశం లభించింది. 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ముగ్గురు మహిళలకు చోటు లభించింది. బీసీలు ఎనిమిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశమిచ్చారు. భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండటంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఆశావహులు, మద్దతుదారులు జాబితా కోసం నరాలు తెగేంత ఉత్కంఠతో క్షణమొక యుగంలా ఎదురు చూశారు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు.

  • Beta

Beta feature