ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ ఆధ్వర్యంలో ఈ-శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్‌పై రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం అమరావతి సచివాలయంలో జరిగింది.
అసంఘటిత రంగంలో పని చేసే కార్మికులందరూ వెంటనే ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదవ్వాలని, ప్రభుత్వం అందించే ప్రయోజనాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 1.5 కోట్ల కార్మికుల రిజిస్ట్రేషన్ చేయించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో 1.50 కోట్ల అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్ తెలిపారు. ఇప్పటివరకు 81.52 లక్షల మంది కార్మికుల నమోదు పూర్తయిందన్నారు. మిగిలిన కార్మికులు కూడా వెంటనే నమోదు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయించాలని అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈ-శ్రమ్ పోర్టల్ అనుసంధానంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదైన కార్మికులకు పలు ప్రయోజనాలు లభిస్తాయని అసంఘటిత రంగ కార్మికులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రూ. 2 లక్షల బీమా రక్షణ – ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM-SBY) కింద, కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సాయం అందుతుంది. రూ. 1 లక్ష అంగవైకల్యం సాయం – ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం చెందిన వారికి రూ. 2 లక్షలు, అర్ధాంగవైకల్యం అయిన వారికి రూ. 1 లక్ష బీమా లభిస్తుంది. ఉచిత సైకిళ్లు & కుట్టు మిషన్లు – కార్మికుల పిల్లలకు ఉచిత సైకిళ్లు, కార్మికులకు పరికరాలు, కుట్టు మిషన్లు, ఇతర ఆర్థిక సాయాలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనుసంధానం – కార్మికుల బదిలీ, వృత్తిపరమైన శిక్షణ, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ-శ్రమ్ కార్డు అనుసంధానంగా ఉంటుంది.
సీఎస్ విజయానంద్ అధికారులను ఈ-శ్రమ్ పోర్టల్‌పై మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్మికులకు ఈ పథకం ప్రయోజనాలు వివరించి, అందరికీ నమోదు అవకాశం కల్పించాలన్నారు. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఉచితంగా ఈ ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వం లక్ష్యం. ఈ సమావేశంలో కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, కార్మిక శాఖ కమిషనర్ శేషగిరిబాబు తదితర అధికారులు హాజరయ్యారు.