AP Government: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. పేదవాడి జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
”ప్రపంచం మొత్తంగా ప్రకృతి సేద్యం వైపు మళ్లిపోతున్నది. మనం తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశాలు పెరిగాయి. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి.
సాగు విధానంలో భారీ మార్పులు వస్తున్నాయి. చిరుధాన్యాలు, పండ్ల సాగు పెరుగుతున్నాయి. సూక్ష్మ నీటిపారుదల విధానాన్ని మరింత ప్రోత్సహిస్తాం. చీడపీడల నుంచి రక్షించే కొత్త పద్ధతులు వచ్చినాయి. మామిడిపంట రక్షణకు ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. డ్రోన్ల ద్వారా చీడపీడలను గుర్తించే పద్ధతులు ప్రవేశపెట్టారు.
పశువుల కోసం ఎక్కడికక్కడ షెడ్లు నిర్మిస్తాం. గడ్డి పంటల క్షేత్రాలు పెంచుతాం. పాల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రకృతి సాగు ద్వారా ఆహార ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుంది. తిరుపతి జిల్లా మొత్తాన్ని పారిశ్రామికీకరించాలి. తిరుపతికి చెందినవారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి.
భవిష్యత్తులో మీ సెల్‌ఫోన్ ఆయుధంలా ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు పంపిణీలో మోసాలు జరగకుండా సాంకేతికత ఉపయోగిస్తాం. విద్యార్థులు ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా తమ నాలెడ్జ్‌ను పెంచుకోవాలి” అని చంద్రబాబు తెలిపారు.