ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపుల్లో ఉన్న వారి కల నెరవేరింది.
ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే వారి ఖాతాల్లో నగదు కూడా జమ చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో, వారి ఆశలు చిగురించాయని చెప్పవచ్చు.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కొక్క హామీని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తోంది. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. తాజాగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేందుకు మంత్రి మండలి ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. రహదారుల అభివృద్ది, ధాన్యం అమ్మిన వెంటనే నగదు జమ, వరద సాయం, డీఎస్సీ నోటిఫికేషన్, ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.
అలాగే దేవాలయాల ధూపదీప నైవైద్యాల కోసం ఎదురుచూపుల్లో ఉన్న అర్చకులకు కూడా ప్రభుత్వం న్యాయం చేసింది. ఆదాయం లేకుండా ఉన్న చిన్న ఆలయాలకు ధూప దీప నైవేద్యాల కోసం అందించే ప్రభుత్వ సాయాన్ని ఏకంగా ప్రభుత్వం రెట్టింపు చేసింది. నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది. రూ.7,000 అర్చకుడికి, రూ.3,000 ధూప, దీప, నైవేద్యానికి వినియోగించాలని ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా మసీదులకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మసీదుల్లో ఇమామ్ లుగా కొనసాగుతున్న వారికి రూ.10,000, మౌజన్‌కు రూ.5,000 గౌరవ వేతనం చెల్లించేందుకు ఉత్తర్వులను సీఎం చంద్రబాబు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రకటనపై మైనారిటీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో అర్చకులు, ఇమామ్ లు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. ఆ సమస్యలను అధికారంలోకి రాగానే తీర్చేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంలోకి రాగానే ఆ హామీలను కూడా నెరవేర్చడంతో అర్చకులు, ఇమామ్, మౌజన్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.