AP Schools: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Fun on Vacation 2024 in AP Schools: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులకు మరో రెండు రోజుల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవులుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెలవులు ఎప్పుడొస్తాయా అని పాఠశాలకు వెళ్లే విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు. పరీక్షల సీజన్ కంప్లీట్ చేసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే వేసవి సెలవుల నేపథ్యంలో ఏపీ పాఠశాల మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల కోసం మరో కొత్త ప్రోగ్రామ్ తీసుకువచ్చింది.


వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఓ నూతన కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో సరదాగా 2024 అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలకు సూచించింది. అలాగే విద్యార్థుల్లో పుస్తకాలు చదవడం మీద ఆసక్తిని పెంపొందించేలా టీచర్లు. హెడ్ మాస్టర్లు వుయ్ లవ్ రీడింగ్ పేరిట పోటీలు నిర్వహించాలని సూచించింది.
సెలవుల్లో సరదాగా కార్యక్రమం అమలుపై పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేశారు. సెలవుల్లో సరదాగా కార్యక్రమం కింద విద్యార్థుల్లో దాగున్న నైపుణ్యాలతో పాటుగా క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలపై దృష్టిపెట్టాలని సూచించారు.స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీలు కూడా ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది.