AP TET 2024 : ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం- మార్చి 6 వరకూ- ముఖ్య వివరాలివే..

ఏపీలో 6100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షకు అర్హత సాధించేందుకు వీలుగా జరుగుతున్న టెట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో ఇవాళ పరీక్షలు ప్రారంభించారు.
ఇవాళ్టి నుంచి మార్చి 6వ తేదీ వరకూ వివిధ కేటగిరీల్లో టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్ధులు సాధించే మార్కులు డీఎస్సీలో కలిసే అవకాశం ఉండటంతో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది.
టెట్ పరీక్షల్లో భాగంగా పేపర్ 1ఏను ఇవాళ్టి నుంచి మార్చి 1వ తేదీ వరకూ నిర్వహించబోతున్నారు. అలాగే పేపర్ 2ఏను మార్చి 2,3,4,6 తేదీల్లో నిర్వహిస్తారు. అటు పేపర్ 1బీని మార్చి 5న ఉదయం సెషన్ లో నిర్వహిస్తారు. పేపర్ 2బీ అదే రోజు మధ్యాహ్నం సెషన్ లో నిర్వహిస్తారు. పూర్తి ఆన్ లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష రాసేందుకు మొత్తం 2.67 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
టెట్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన విద్యాశాఖ.. తెలంగాణ, కర్నాటకల్లో మూడేసి పరీక్షా కేంద్రాలు, తమిళనాడు, ఒడిశాలో రెండేసి పరీక్షా కేంద్రాల్ని అందుబాటులో ఉంచింది. గర్భిణులకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాలు కేటాయించారు. అలాగే దివ్యాంగులకు స్క్రైబ్ సాయంతో పరీక్షలు రాసేందుకు వీలు కల్పించారు.


డీఎస్సీ పరీక్షలో టెట్ పరీక్షలో సాధించే మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షల్ని కూడా అభ్యర్ధులు సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వకపోవడంతో అభ్యర్ధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా రాకరాక వచ్చిన డీఎస్సీ కావడంతో ఉన్న కాస్త సమయంలోనే రెండు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.