భారత్‌లో యాపిల్ విక్రయాలు జోరందుకున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విక్రయాలు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) శుక్రవారం వెల్లడించాడు. అదే సమయంలో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా అవతరించిందన్నారు.
అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసిందని టిమ్ కుక్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఐ ఫోన్ రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అని పేర్కొన్నారు. ఇక పీసీలు, ట్యాబ్లెట్లకు మూడో అతిపెద్ద మార్కెట్‌గా యాపిల్ నిలిచిందన్నారు. భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ మోడల్‌గా ఐఫోన్ నిలవడం ఇదే తొలిసారి. భారత్‌తో పాటు అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల్లో వీటి విక్రయాలు జోరందుకున్నట్లు కుక్ తెలిపారు.
కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం 2024లో విలువ పరంగా యాపిల్ 23 శాతం, శాంసంగ్ 22 శాతం మార్కెట్ వాటాతో నిలిచాయి. వివో (16 శాతం), ఒప్పో (14 శాతం), షావోమీ (9 శాతం) వాటాతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. యాపిల్ ప్రత్యేకంగా భారతదేశంపై ఆసక్తిగా ఉందని టిమ్‌కుక్ తెలిపారు. యాపిల్ ఇంటెలిజెన్స్‌ను ఇంగ్లీష్‌తో సహా మరిన్ని భాషలకు సపోర్ట్ చేసేలా తీసుకొస్తామని వెల్లడించారు. భారత్‌లో ఎంటర్‌ప్రైజ్ విభాగం నుంచి యాపిల్‌కు బలమైన డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. 2023 ఏప్రిల్‌లోనే దిల్లీ, ముంబయిలో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. ఈ స్టోర్లకు వచ్చిన ఆదరణ నేపథ్యంలో విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే బెంగళూరు, పుణె, దిల్లీ -ఎన్‌సీఆర్, ముంబయిలో మరో నాలుగు స్టోర్లు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
































