అలర్ట్​: బ్రేక్​ఫాస్ట్​గా అన్నం తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

Health Benefits of Eating Rice in Breakfast: సాధారణంగానే చాలా మంది ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేస్తుంటారు. ఇక అల్పాహారం అంటే ఇడ్లీ, దోశ, వడ, పూరీ వంటివి గుర్తొస్తాయి. అయితే చాలా మంది ఉదయం పూట టిఫెన్స్​కు బదులుగా అన్నం తింటుంటారు. ఇలా తినే వారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఉదయాన్నే అన్నం తినడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. కానీ, అంతకు మించి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మరి ఆ లాభాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..


శక్తిని అందిస్తుంది: అన్నం కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడానికి సహాయపడతాయి. అలాగే రోజంతా యాక్టివ్​గా ఉంచుతుంది. ఉదయం పూట అన్నం తినడం వల్ల మీకు రోజంతా పనిచేయడానికి కావలసిన శక్తి లభిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా: అన్నంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల DNA ను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇది మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలను తగ్గిస్తుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది: మెదడుకు శక్తిని అందించే గ్లూకోజ్​కు అన్నం బెస్ట్​ ఆప్షన్​. బ్రేక్​ఫాస్ట్​లో అన్నం తినడం వల్ల మీరు మరింత ఏకాగ్రతతో, స్పష్టంగా ఆలోచించగలరని నిపుణులు అంటున్నారు.

గుండె ఆరోగ్యానికి మంచిది: ఉదయం పూట అన్నం తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అన్నంలో ఫైబర్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

2002లో The New England Journal of Medicineలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అన్నం ఎక్కువగా తినే వ్యక్తులు గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 17% తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో పోషణ విభాగంలో ప్రొఫెసర్ డా.డేవిడ్ జె. లీ, MD, PhD పాల్గొన్నారు. అన్నం తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 5% తగ్గుతాయని, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు 4% పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. అయితే తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్​రైస్​ ఎక్కువ మేలు చేస్తుందని చెబుతున్నారు.

జీర్ణక్రియకు మంచిది: అన్నం జీర్ణం చేయడానికి సులభమైన ఆహారం అని.. ఇది జీర్ణ సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

ఒత్తిడిని తగ్గిస్తుంది: అన్నం తినడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది: బియ్యంలో విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.