Mangoes Test: కృత్రిమంగా పండించిన మామిడి పండ్లతో జాగ్రత్త, వాటిని ఇలా గుర్తించండి

Mangoes Test: మామిడిని పండ్ల జాతికే రారాజుగా పిలుస్తారు. ఎంతోమంది ఈ మామిడి పండ్ల కోసమే వేసవి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే మామిడి పండ్లు సహజసిద్ధంగా పండినవి తింటేనే ఆరోగ్యం. కృత్రిమంగా పండించినవి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా రసాయనాలు వేసి పండించిన మామిడి పండ్లు అధికంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి శరీరానికి కీడు చేస్తాయి. అలాంటి వాటిని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను ఎలా గుర్తించాలో తెలుసుకోండి.


ఈ రసాయనాలతో..
మామిడి పండ్లను కృత్రిమంగా పండించడం కోసం క్యాల్షియం కార్బైడ్ వంటి హానికరమైన రసాయనాలను వినియోగిస్తారు. ఈ రసాయనాలను చల్లడం వల్ల మామిడి పండ్లు త్వరగా పసుపు రంగులోకి మారుతాయి. కేవలం క్యాల్షియం కార్బైడ్ మాత్రమే కాదు మరిన్ని రసాయనాలను కూడా వినియోగిస్తూ ఉంటారు. అలాంటి పండ్లను తినకూడదు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి వినియోగించే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం క్యాన్సర్ కారక లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని వెల్డింగ్ పనిలో అధికంగా వినియోగిస్తూ ఉంటారు. ఇది చాలా చౌకగా మార్కెట్లో లభిస్తుంది. కాబట్టే వ్యాపారులు ఈ రసాయనాన్ని కొని మామిడి పండ్లను పండించడానికి వినియోగిస్తూ ఉంటారు.

ఈ కాల్షియం కార్బైడ్ లో ఫాస్పరస్ హైడ్రాయిడ్, ఆర్సెనిక్ వంటి రసాయనాలు కూడా కలుస్తాయి. ఈ రసాయనాలు పొరపాటున శరీరంలో చేరితే వాంతులు, విరేచనాలు, చర్మంపై పుండ్లు పడడం, కంటి చూపు దెబ్బ తినడం, శ్వాస ఆడక పోవడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇలా గుర్తించండి
కృత్రిమంగా పండిన మామిడి పండ్లను గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. సహజంగా పండిన మామిడితో పోలిస్తే కృత్రిమంగా పండిన మామిడి పండ్లు అధికంగా పసుపు రంగును, నారింజరంగును కలిసి ఉంటాయి. కాస్త మెరుస్తూ కనిపిస్తాయి. సహజంగా పండిన మామిడి పండ్లు తీపి, వాసన వస్తూ ఉంటాయి. అదే కృత్రిమంగా పండిన మామిడి పండ్లు తీపి వాసన వేయవు. భిన్నమైన వాసనను కలిగి ఉంటాయి. కృత్రిమంగా పండిన మామిడి పండ్లు… సహజ మామిడి పండు కన్నా మెత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ రసాయనాలు పండులోని గోడలను విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే అవి మెత్తగా అవుతాయి. కాబట్టి మెత్తగా ఉన్న మామిడి పండ్లను కొనకూడదు. మామిడిపండ్లపై చిన్న చిన్న గాయాలు, మచ్చలు వంటివి కనిపిస్తే కొనకపోవడమే మంచిది. కొన్ని రకాల రసాయనాలను ఇంజక్షన్ల రూపంలో మామిడిపండు లోపలికి పంపిస్తారు. వీటి వల్ల కూడా మచ్చలు ఏర్పడతాయి.

బకెట్ టెస్ట్
కృత్రిమంగా పండిన మామిడి పండ్లు చప్పగా ఉండడం లేదా కాస్త భిన్నమైన రుచిని కలిగి ఉంటాయి. అలా ఉంటే అవి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లు అని అర్థం. ఒక బకెట్లో నీటిని వేసి మామిడికాయలను ఆ నీటిలో ఉంచండి. ఆ మామిడికాయలు మునిగిపోతే అవి సహజంగా పండినవి అని అర్థం. అవి మునగకుండా తేలిపోతున్నట్లయితే అవి కృత్రిమంగా పండించినవి అని అర్థం చేసుకోవాలి.

బేకింగ్ సోడా టెస్ట్
నీటిలో కొంచెం బేకింగ్ సోడా వేసి మామిడికాయలను ఆ మిశ్రమంలో పావుగంట సేపు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మామిడికాయలను శుభ్రంగా కడిగి బయటకు తీయండి. మామిడి పండ్ల రంగు మారితే అవి రసాయనికంగా పండినవి అని అర్థం చేసుకోవాలి.