ప్రాణాంతకంగా మారుతున్న లివర్ సిర్రోసిస్.. ఎందుకు వస్తుంది?.. ఎలా నివారించాలి?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేయాలి. అలాంటి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం (లివర్) ఒకటి. దీని పనితీరు ఏమాత్రం మందగించినా వివిధ అనారోగ్యాలు సంభవించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.


ముఖ్యంగా ఇటీవల ‘లివర్ సిర్రోసిస్’ కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఆరోగ్య నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 7 లక్షల 70 వేల మందికి పైగా లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నారు. శరీరంలో ప్రోటీన్ లెవల్స్ తీవ్రస్థాయిలో పడిపోయి, కాలేయ కణాలు దెబ్బతినడాన్నే లివర్ సిర్రోసిస్ అంటారు.

అసలు కారణం ఇదే

కాలేయ కణాలు దెబ్బతినడంవల్ల లివర్ సిర్రోసిస్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఇండియాలో ఇది రావడానికి ప్రధాన కారణం మద్యపానం సేవించడమే. ఆల్కహాల్‌కు అడిక్ట్ అయిన వారిలోనే ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తున్నట్లు నివేదికలు సైతం పేర్కొంటున్నాయి. దీంతోపాటు హెపటైటిస్ బి, సి, వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలం కొనసాగినా లివర్ సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. కానీ దాదాపు 30 శాతం వరకు సమస్యలకు ప్రధాన కారణం మాత్రం ఆల్కహాల్ సేవించడమే. అయితే ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, కాలుష్యాలవల్ల నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇండ్యూస్డ్ సిర్రోసిస్ ప్రాబ్లమ్స్ కూడా ఇటీవల పెరుగుతున్నాయి.

వ్యాధి లక్షణాలు

లివర్ సిర్రోసిస్ బాధితుల్లో కనిపించే అత్యంత ప్రాథమిక లక్షణం తీవ్రమైన అలసట. బాడీలో ప్రోటీన్ లెవెల్స్ పడిపోవడంవల్ల ఇలా జరుగుతుంది. దీంతోపాటు కాళ్లల్లో వాపు, పొత్తికడుపులో లిక్విడ్స్ పేరుకుపోయిన అనుభూతి, రక్తపు వాంతులు, కళ్లు ఎల్లో కలర్‌లోకి మారడం వంటివి లివర్ సిర్రోసిస్ లక్షణాలు.

నిర్ధారణ – చికిత్స

లివర్ సిర్రోసిస్‌ను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చు. వ్యాధి నిర్ధారణ తర్వాత వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. హెపటైటిస్ బి, సి లను నియంత్రించగలిగే మందులనే లివర్ సిర్రోసిస్‌ చికిత్సలోనూ ఉపయోగిస్తారు. అయితే లివర్ డ్యామేజ్ కానంత వరకే ఇవి పనిచేస్తాయి. డ్యామేజ్ అయితే మాత్రం శస్త్ర చికిత్స ద్వారా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌ చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది సమస్య తీవ్రం అయ్యాక వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే దాదాపు 80 శాతం వరకు మెడిసిన్ ద్వారా తగ్గే చాన్సెస్ ఉంటాయి.