Virat Kohli: ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2024 సీజన్‌లో టాప్‌ స్కోరర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli). ఆరెంజ్‌ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ప్రస్తుతం 13 మ్యాచుల్లో 661 పరుగులతో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో తన ఆర్సీబీ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లేందుకు పట్టుదలగా ఉన్నాడు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లోనూ కోహ్లీ ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. 35 ఏళ్ల విరాట్ ఫిట్‌నెస్‌ ఇప్పుడున్న క్రికెటర్లలో ఎవరికీ లేదు. కనీసం నాలుగైదేళ్లు ఆడగలిగే సత్తా అతడి సొంతం. అయితే, ఒక్కసారి ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మరెవరికీ కనిపించనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఎప్పుడైనా సరే మ్యాచ్‌ ఆడిన తర్వాత.. ఎందుకు అలా ఆడానా? అని పశ్చాత్తాపపడకూడదని తెలిపాడు.


‘‘స్పోర్ట్స్‌ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్‌ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలి. అందుకే, నేనెప్పుడూ ‘ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది’ అనుకుంటూ నా కెరీర్‌ను ముగించదల్చుకోలేదు. అసలు అలాంటి విషయాలను పట్టించుకోను. నేను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండను. అక్కడితో వదిలేసి తదుపరి మనం చేయగలిగే తర్వాత వాటిపైనే ఆలోచిస్తా. క్రికెట్‌కు నేను వీడ్కోలు పలికిన తర్వాత చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించను. సుదీర్ఘమైన విరామం తీసుకుంటా. ఆ తర్వాతే ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటా. మీకు కూడా కనిపించను (నవ్వుతూ). కాబట్టే నేను ఆడినంత కాలం అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ఇష్టపడతా. ఆ స్ఫూర్తే నన్ను నడిపించేది’’ అని కోహ్లీ తెలిపాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. టీ20 ప్రపంచ కప్‌ కూడా ప్రారంభం కానుంది. అందులోనూ అతడు కీలక పాత్ర పోషిస్తాడని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు 13 మ్యాచుల్లో ఆరు విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాల ఆధారంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది. అయితే, సీఎస్కేతో పోరుకు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉందని సమాచారం. ఈ మ్యాచ్‌ రద్దైతే ఆర్సీబీ ఇంటిముఖం పట్టినట్లే.