నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్పాహారం మానేయడం అంటే ఒకపూట భోజనం మానేయడం కాదు. ఇది శరీరం మొత్తం నిర్మాణాన్ని దెబ్బతీయడం అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే..
శరీరం ఎక్కువ కాలం పోషకాహార లోపానికి గురవుతుంది. దీనివల్ల మధ్యాహ్నం వరకు చాలా ఆకలిగా ఉంటుంది. ఈ ఆకలి తరువాత ఎక్కువ తినడం, అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటారట. దీనివల్ల బరువు, పొట్ట కొవ్వు పెరుగుతుంది.
అల్పాహారం మానేయడం వల్ల ఆకలిని పెంచే ఘ్రెలిన్ హార్మోన్ మరింత చురుకుగా మారుతుంది. దీనివల్ల స్వీట్, ఫ్యాట్ క్రేవింగ్స్ పెరుగుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర నియంత్రణ దెబ్బతినడం ప్రారంభమవుతుంది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది.
పరిశోధనల ప్రకారం.. ప్రతిరోజూ అల్పాహారం మానేసే వారిలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, గుండెపోటుకు ప్రధాన కారణం. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో జీవక్రియ ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
అల్పాహారం మానేసే అలవాటు నెమ్మదిగా మెటబాలిక్ సిండ్రోమ్‌కు కూడా దారి తీస్తుంది. దీనివల్ల పొత్తికడుపు కొవ్వు, అధిక రక్తపోటు, అధిక చక్కెర, చెడు కొలెస్ట్రాల్ ఒకేసారి పెరుగుతాయి. ఇదే విధానం టైప్ 2 డయాబెటిస్‌కు పెద్ద ముప్పుగా మారుతుంది. రోజూ అల్పాహారం తీసుకోని వారిలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.
అంతేకాకుండా ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించదు. అలాంటి వారు త్వరగా అలసిపోతారు. చికాకుతో ఉంటారు. ఏకాగ్రతతో ఉండటానికి ఇబ్బంది పడతారు. రక్త చక్కెర స్థాయిలు మానసిక పనితీరును కూడా తగ్గిస్తాయి.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కువ సమయం తీసుకుంటే.. శరీరం త్వరగా శక్తిని పొందడానికి తీపి, వేయించిన, అధిక కేలరీల ఆహారం వైపు ఆకర్షిస్తుంది. ఇది ఆహార నాణ్యతను తగ్గిస్తుంది. దీర్ఘకాలంలో బరువు, చక్కెర, గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టింపు అవుతుంది.































