భోజనం చేస్తూ రీల్స్ చూస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

 రోజుల్లో చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా కనిపించే వారు చాలా తక్కువ. ఇది జీవితంలో విడదీయలేని భాగమైంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ చాలామంది ఫోన్ స్క్రీన్‌నే చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది.


ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వంటి చిన్న వీడియోలు చూసే అలవాటు బాగా పెరిగింది. కొంతమంది అయితే భోజనం చేస్తూ కూడా రీల్స్ చూడకుండా తినలేకపోతున్నారు. కానీ తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని చెబుతోంది.

అధ్యయనం ఏమి చెబుతోంది?
తాజా పరిశోధన ప్రకారం, భోజనం చేస్తున్న సమయంలో రీల్స్ లేదా మొబైల్ వీడియోలు చూడడం వల్ల శరీరానికి కావాల్సిన సంకేతాలు మెదడుకు సరిగా చేరవు. మనం తినే ఆహారం ఎంత మోతాదులో తిన్నామో, కడుపు నిండిందో లేదో మెదడు గుర్తించాలి. కానీ స్క్రీన్‌పై పూర్తి దృష్టి ఉండడం వల్ల మెదడు ఆహారంపై దృష్టి పెట్టడం మానేస్తోంది. దీని వల్ల అవసరానికి మించి తినే ప్రమాదం పెరుగుతోంది.

సాధారణంగా భోజనం చేస్తూ ఉంటే మనం రుచి, వాసన, నమలడం వంటి విషయాలను మెదడు గుర్తిస్తూ ఉంటుంది. అలా తినడం వల్ల కడుపు నిండిందనే భావన కలుగుతుంది. కానీ రీల్స్ చూస్తూ తినేటప్పుడు ఆహారంపై దృష్టి తగ్గిపోతుంది. ఎంత తిన్నామో కూడా తెలియకుండా ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఈ విధంగా రోజూ అదనంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడం మొదలవుతుంది.

షుగర్ పెరిగిపోతుంది
ఈ అలవాటు దీర్ఘకాలంలో ఊబకాయానికి దారి తీస్తుంది. బరువు పెరిగితే దానికి తోడు షుగర్, హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ అలవాటుకు ఎక్కువగా బానిస అవుతున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి జీవనశైలి అలవాట్లు ఏర్పడితే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రీల్స్ చూస్తూ తినడం జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. మనం నెమ్మదిగా నమిలి తినాలి. కానీ స్క్రీన్ చూస్తూ తినేటప్పుడు త్వరగా మింగేస్తాం. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, పొట్ట ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

ఈ అలవాటు పిల్లల్లోనే అధికంగా ఉంది. ఇది వారిపై మరింత ప్రభావం చూపిస్తోంది. భోజనం సమయంలో కార్టూన్లు లేదా రీల్స్ చూపిస్తే పిల్లలు తింటారని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఇది ప్రమాదకరమైన అలవాటుగానే చెప్పుకోవాలి. పిల్లలు ఆకలిని గుర్తించే శక్తిని కోల్పోతారు. భోజనం అంటే ఫోన్ చూడాల్సిందే అనే భావన వారి మనసులో బలంగా పడిపోతుంది. ఇది భవిష్యత్తులో ఆహారపు అలవాట్లను పూర్తిగా చెడగొడుతుందని నిపుణులు చెబుతున్నారు.
శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యంపైనా దీని ప్రభావం పడుతోంది. భోజనం సమయంలో కూడా మెదడుకు విశ్రాంతి దొరకదు. ఎప్పుడూ స్క్రీన్ చూస్తూ ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయం తగ్గిపోతుంది. ఇలా సామాజిక సంబంధాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.