Arunachala temple: అరుణాచలం వెళ్తున్నారా? ఏ రోజు ఎలాంటి ప్రదక్షిణ చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసా?

Arunachala temple giri pradakshina: ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన శైవ క్షేత్రాలలో తిరువణ్ణామలై ఒకటి. ఈ క్షేత్రంలో కొలువైన శివలింగం.. పంచభూత లింగాలలో ఒకటని హిందూ పురాణాలలో చెప్పబడింది. తిరువణ్ణామలై క్షేత్రాన్నే అరుణాచలం అని కూడా పిలుస్తారు. అరుణాచల ఆలయానికి ఎంతటి ప్రాశస్త్యం ఉందో.. అక్కడ చేసే గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి అక్కడ కొండ మీద జరిగే జ్యోతి ప్రజ్వలన క్రతువు నబూతో నభవిష్యత్తి అన్నట్టుగా ఉంటుంది. దాదాపు మూడు టన్నుల నెయ్యితో కొండ మీద వెలిగించే భారీ దీపం పదిహేను రోజలు ఆరిపోకుండా వెలుగుతుండటం అక్కడి ప్రత్యేకత. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి కోట్లమంది భక్తులు అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారని అక్కడి నిర్వాహకులు చెప్తుంటారు.

పరమేశ్వరుడు అగ్ని లింగ రూపంలో వెలిసిన అద్బుత క్షేత్రమే అరుణాచలం. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినంత మాత్రానే గత జన్మల చెడు కర్మలన్నీ కరిగిపోతాయని క్షేత్ర పురాణంలో ఉన్నట్లు పండితులు చెప్తున్నారు. అయితే ఏ రోజు అరుణగిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుందనేది కూడా అందులో పొందుపరిచినట్లు పండితులు చెప్తున్నారు.

సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందని పండితులు చెప్తున్నారు.
మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుందని.. ఎంతటి పేదవాడైనా గిరిప్రదక్షిణ తర్వాత ధనవంతుడు అవ్వడమే కాకుండా తరతరాల వరకు వాళ్ల వంశం సుభిక్షంగా ఉంటుందంటున్నారు. ఇక మరణానంతరం ఆ వ్యక్తికి మోక్షం లభిస్తుందంటున్నారు. ఎంతో మంది సిద్దులు ఇప్పటికీ మంగళవారం నాడే గిరి ప్రదక్షిణలు చేస్తారంటున్నారు.
బుధవారం అరుణగిరి ప్రదక్షిణ వల్ల లలిత కళలలో రాణిస్తారని.. జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారంటున్నారు. అలాగే గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని.. ఆత్మజ్ఞానం కోసం తపించే ఎంతో మంది అరుణగిరి ప్రదక్షిణ గురువారం చేస్తారని తెలుపుతున్నారు.
శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని… మరణానంతరం ఆ వ్యక్తి ఆత్మ నేరుగా వైకుంఠానికి వెళ్తుందని చెప్తున్నారు. శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిధ్ధిస్తుందని.. శనిదోషాలు హరించుకుపోతాయని, కష్ట కారుకుడైన శని శాంతిస్తాడని పండితులు అంటున్నారు.
ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేస్తే కైలాసప్రాప్తి కలుగుతుందంటున్నారు పండితులు. పిల్లలు లేని భార్యాభర్తలు నియమనిష్టలతో భక్తిగా 48 రోజుల పాటు గిరి ప్రదక్షిణ చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందంటున్నారు. గిరి ప్రదక్షిణ చేయడానికి వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టివచ్చిన పుణ్య ఫలం లభిస్తుంది. రెండవ అడుగులో పవిత్ర తీర్ధాలలో స్నానం చేసిన ఫలితం వస్తుందని… మూడవ అడుగు వేయగానే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం లభిస్తుందని… నాలుగవ అడుగు వేయగానే అష్టాంగ యోగం చేసిన ఫలితం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.
తిరువణ్ణామలైలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు ఐదు సార్లు గిరికి ప్రదక్షిణలు చేస్తే పాప కర్మల నుంచి విముక్తి లభిస్తుందని… భరణీ దీపం రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఒక సారి, ఏడు గంటలకు ఒకసారి, పదకొండు గంటలకు ఒకసారి, సాయంకాలం దీపదర్శన సమయాన మరోసారి, రాత్రి 11గం.లకు చివరిసారి మొత్తం ఆరోజు.. ఐదు సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే ఘోర పాపాలన్నీ హరిస్తాయని పండితులు సూచిస్తున్నారు. అయితే గిరి ప్రదక్షిణం చేసి రాగానే స్నానం చేయడమో.. నిద్రపోవడమో చేయకూడదని వాటివల్ల పుణ్యఫలం తగ్గి పాపం ఫలం పెరుగుతుందని కాబట్టి ఆరోజంతా భగవన్నామ స్మరణలోనే గడపాలంటున్నారు పండితులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *