ED Alleges: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో మామిడిపండ్లు, మిఠాయిలు తిని చక్కెర స్థాయి పెంచుకుంటున్నారని ఆరోపించింది.
షుగర్ లెవల్స్ పెంచుకుని అనారోగ్యం పేరుతో బెయిల్‌కు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు చేసింది. ఈడీ చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ మార్చి 21వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా కోర్టులో భంగపాటు ఎదురవుతోంది. మధుమేహంతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. జైలులో ఉన్న అతడి చక్కెర స్థాయిలు పడిపోతున్నాయని.. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.
వాదనల సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయమూర్తులు సంచలన ఆరోపణలు చేశారు. ‘అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడిపండ్లు, మిఠాయిలు తింటున్నారు. అంతేకాదు చక్కెరతో కూడిన చాయ్ తాగుతున్నారు’ అని ఈడీ కోర్టులో వాదించింది. దురుద్దేశంతోనే మిఠాయిలు తింటూ చక్కెర స్థాయిలు పెంచుకుంటున్నారు అని వాదించారు. చక్కెర స్థాయి పెరిగితే వైద్యపరమైన కారణాలు చూపుతూ బెయిల్ పొందాలని చూస్తున్నారని ఈడీ తరఫున న్యాయవాదులు వివరించారు. అయితే ఈడీ ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు తిప్పికొట్టారు. ఆ ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని కొట్టిపారేశారు.
‘చక్కెర స్థాయి విలువలు భారీగా పడిపోతున్నాయని.. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలకోసం వారానికి మూడు సార్లు నా రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి ఇవ్వాలి’ అని అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యూడిషీయల్ కస్టడీ విధించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్‌లో ప్రచారం చేయాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాలిస్తున్న ఈ రెండు ప్రాంతాల్లో ప్రచారం చేసి అత్యధిక స్థానాలు పొందాలనే భారీ వ్యూహంతో ఉన్న కేజ్రీవాల్‌ను అనూహ్యంగా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ నిస్తేజంలో మునిగింది.