వేతన సవరణ సంఘం, ఐఆర్‌తోపాటు డీఏలు, వేతనాల పెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆశల్లో ఉన్నారు. దసరా, దీపావళి సందర్భంగా ప్రభుత్వం భారీ ప్రకటనలు ఇస్తుందని ఆశిస్తున్నారు.
అయితే అవేమీ లేనట్టు అసెంబ్లీలో ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. వేతన సవరణ సంఘం, ఐఆర్ లేనట్టు అసెంబ్లీలో మంత్రి చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి ఝలక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఇప్పట్లో లేనట్టేనని మంత్రి పయ్యావుల కేశవ్ చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోంది. పీఆర్‌సీ, ఐఆర్ తమ పరిశీలనలో ఉందని మాత్రమే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. మంత్రి ప్రకటన విని ప్రభుత్వ ఉద్యోగులు నిరాశకు గురయ్యారు.
ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డీఏ, బకాయిలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, అకేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపక్ష ప్రశ్నించారు. పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్న వేశారు. వారి ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల ఐఆర్, పీఆర్సీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి కేశవ్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. అయితే ఎప్పుడిస్తారు అనే ప్రశ్నపై మాత్రం సమాధానం మంత్రి చెప్పలేదు.
ఏ స్థాయిలో ఇస్తారు ఐఆర్ అనేది మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో లేదు. డీఏ బకాయిలు రూ.12,119 కోట్లు ఉన్నాయని ఉన్నాయని మంత్రి తన సమాధానంలో తెలిపారు. అయితే ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అనేది మాత్రం సమాధానంలో చెప్పలేకపోవడం గమనార్హం. అసెంబ్లీ వేదికగా మంత్రి ఇచ్చిన సమాధానం చూసి ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దసరా, దీపావళికి కానుక ఉంటుందని భావిస్తే అదేమీ లేనట్టు కనిపిస్తోందని మంత్రి ప్రకటన చూసిన ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు.
































