చలికాలం ప్రారంభం కాగానే చాలా మందికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి చలి సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉష్ణోగ్రత తగ్గడంతో రోగనిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది.
దీనివల్ల మనకు అనేక సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలా వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యలకు మందులు తీసుకోవడం కంటే.. హోమ్ రెమిడీలు ట్రై చేయవచ్చు. ఎఫెక్ట్ ఎక్కువగా లేనప్పుడు.. ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం.. ఆయుర్వేద సుగుణాలు ఉన్న కషాయాన్ని తీసుకోవచ్చు. ఇంతకీ ఆ కషాయం ఏంటి? దానివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
ఆయుర్వేద కషాయం
ఆయుర్వేద కషాయం మన భారతదేశంలో పురాతన కాలం నుంచి కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు. మీరు దీన్ని ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పసుపు, దాల్చిన చెక్క, కొన్ని తులసి ఆకులు, లవంగాలు, నల్ల మిరియాలు వంటి మన వంటింట్లో సులభంగా లభించే పదార్థాలతో దీనిని తయారు చేస్తారు. మీరు ఎంత కషాయం తయారు చేయాలనుకుంటున్నారో.. అంత నీరు ఒక పాత్రలో వేయండి.
కావాల్సిన పదార్థాలు
- 8–10 తులసి ఆకులు
- 1 ముక్క అల్లం (సగం గ్రైండ్ చేసినది)
- 4–5 నల్ల మిరియాలు (కొద్దిగా పొడి చేసుకోవాలి)
- 5–6 లవంగాలు
- 1 చిన్న ముక్క దాల్చిన చెక్క
- 1/4 టీస్పూన్ పసుపు
- 2 గ్లాసుల నీరు
- 2–3 టీస్పూన్ల తేనె
పాత్రలో 2-3 గ్లాసుల నీరు పోసి మరిగించండి. తరువాత 3-4 తులసి ఆకులు వేసి, అల్లం ముక్కను కూడా మరిగే నీటిలో వేయండి. తరువాత రెండు, మూడు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, చిటికెడు పసుపు వేసి తక్కువ మంట మీద మరిగించండి. పాత్రలో నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. తయారుచేసిన కషాయాన్ని వడకట్టి కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి వేడిగా తాగండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆయుర్వేద కషాయంలో ఉపయోగించే అన్ని పదార్థాలు మన వంటింట్లో లభిస్తాయి.
కషాయ ప్రయోజనాలు
ఆయుర్వేదం ప్రకారం.. చలికాలంలో ఈ కషాయం తాగడం వల్ల మన జీర్ణశక్తి బలపడుతుంది. దీనివల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. దగ్గు, జలుబు వంటి వ్యాధులు మాయమవుతాయి. గొంతులో పేరుకుపోయిన కఫం, శ్లేష్మం తొలగిపోతాయి. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి. పెద్దలు, వృద్ధులు మాత్రమే కాకుండా పిల్లలు కూడా దీనిని తాగవచ్చు. ఎందుకంటే చలికాలంలో పిల్లలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి వారికి కూడా ఇవ్వచ్చు. కాబట్టి చలికాలంలో దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.


































