తక్కువ రిస్క్‌తో, ఎక్కువ భద్రతతో, ఆకర్షణీయ ప్రయోజనాలతో పిల్లలకు ఇండియా పోస్ట్ (భారతీయ తపాలా శాఖ) ఓ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నది. పిల్లల విద్య, వివాహాది ఖర్చులకు తల్లిదండ్రులకు బాల జీవన్ బీమా పథకం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. అధికారిక ఇండియా పోస్ట్ పోర్టల్ ద్వారా లేదా సమీపంలోని పోస్టాఫీస్ కార్యాలయానికి వెళ్లి బీమాను పొందవచ్చు.
ఇదీ సంగతి..
- భారతీయ తపాలా శాఖ ఈ బాల జీవన్ బీమా యోజనను అందిస్తున్నది.
- పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ)/రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్‌ఐ) పాలసీ కలిగిన తల్లిదండ్రుల పిల్లలు ఈ బీమాకు అర్హులు.
- ఇద్దరు పిల్లలకే వర్తిస్తుంది. వయసు కనిష్ఠంగా 5, గరిష్ఠంగా 20 ఏండ్లే ఉండాలి.
- తల్లిదండ్రుల్లో పాలసీదారు వయసు 45 దాటరాదు.
- గరిష్ఠంగా రూ.3 లక్షలు లేదా తల్లి/తండ్రి బీమా (సమ్ అష్యూర్డ్) ఎంత? ఉంటే అంత. (ఏది తక్కువగా ఉంటే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు)
- పాలసీ ఉన్న తల్లి లేదా తండ్రి చనిపోతే అప్పట్నుంచి పిల్లల బీమా ప్రీమియంలు రైద్దెపోతాయి. అయినప్పటికీ పాలసీ కొనసాగుతుంది.
- మెచ్యూరిటీ అయినప్పుడు ప్రయోజనాలతో బీమా సొమ్ము పాలసీదారు చేతికి వస్తుంది.
- పాలసీ కాలపరిమితి ముగిసినా లేదా దురదృష్టవశాత్తు పిల్లలు మరణించినా బీమా సొమ్ము బోనస్‌తో సహా తల్లిదండ్రులకు అందుతుంది.
- పిల్లలకు ఎలాంటి వైద్య పరీక్షలూ అవసరం లేదు. (అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండాలి).
- కనీస డాక్యుమెంటేషన్‌తో ఇన్సూరెన్స్.
- లోన్లు/సరెండర్ సౌకర్యం ఉండదు.
- ప్రీమియంలను ఏ పోస్ట్ ఆఫీస్‌లోనైనా చెల్లించవచ్చు.


































