అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచి విదేశీయులు అమెరికాలోకి అడుగుపెట్టకుండా అనేక చర్యలు తీసుకున్నారు.
గత కొన్ని నెలలుగా అనేక సంస్కరణలను చేపట్టారు. ఈ క్రమంలో విదేశీ టూరిస్టుల విషయంలో ట్రంప్ సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టూరిస్టులకు.. 5 ఏళ్లకు సంబంధించిన తమ సోషల్ మీడియా హిస్టరీని అందించాల్సిన అంశాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అలాగే విదేశాల నుంచి వచ్చే పర్యటకులు ఫేస్ స్క్రీనింగ్ ప్రాసెస్ లో భాగంగా సెల్ఫీలను అప్లోడ్ చేయాలన్న రూల్ ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోకి విదేశీయుల రాకను తగ్గించే విధంగా ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే ఈ విధానాన్ని ట్రయల్ విధానంలో అమలు చేసేందుకు అగ్రరాజ్యం సిద్దమైంది.
బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్ నుంచి అమెరికాలోకి వచ్చే విదేశీయులు తప్పనిసరిగా ఐదేళ్ల సోషల్ మీడియా అకౌంట్ హిస్టరీని సంబంధిత అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సంస్థ పోస్టు చేసింది. ఈ ప్రొపోజల్ కు 60 రోజుల నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించింది.
యూఎస్ వీసా ఫ్రీ దేశాల నుంచి టూరిస్టులు.. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ అండ్ ఆథరైజేషన్(ESTA) కు అప్లై చేసుకోవచ్చు. దీనిలో భాగంగా 90 రోజుల పాటు అమెరికాలో పర్యటించవచ్చు. అయితే తాజాగా సోషల్ మీడియా హిస్టరీని తప్పనిసరి చేసేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో ఆయా దేశాల పర్యటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా హిస్టరీతోపాటుగా టూరిస్టులు.. సెల్ఫీలను కూడా అప్లోడ్ చేయాలన్న కొత్త నిబంధన తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లపై అక్కడి సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటే అది అమెరికాకే పెద్ద ముప్పని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.































