ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ పథకం అమలు విధివిధానాలపై ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది.
ఈ నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ పథకాన్ని సాఫీగా అమలు చేసేందుకు వీలుగా ఆర్టీసీ పలు చర్యలు చేపడుతోంది. దీంతో ఆగస్టు 15 నుంచి ఈ బస్సుల్లో ప్రయాణించే మహిళలతో పాటు ఇతర బస్సుల్లో ప్రయాణించే వారు కూడా ఈ మార్పులు గమనించాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో చాలా బసుల్లో ప్రస్తుతం ఉన్న 3 ప్లస్ 2 సీటింగ్ విధానాన్ని మార్చి ఎక్కువ మంది ప్రయాణించేలా 2 ప్లస్ 2 సీటింగ్ సౌకర్యం కల్పించనున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలయ్యాక మహిళల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రయాణించేలా ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే మహిళల తాకిడి ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసుల్ని పెంచుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకూ మహిళలకు ఎక్కువగా బస్సు ప్రయాణాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఆ సమయాల్లో సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. ఇందుకోసం రద్దీ లేని రూట్లలో బస్సుల్ని రద్దిగా ఉండే రూట్లకు మళ్లించే అవకాశముంది.
అలాగే విద్యార్ధుల కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఆగస్టు 15న ఉచిత ప్రయాణం మొదలైతే ఈ బస్సుల్ని ఉదయం నుంచి రాత్రి వరకూ నడిపేందుకు కూడా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో ఆయా బస్సుల్లో మహిళలు నిరంతరాయంగా ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉచిత బస్సు పథకంతో తలెత్తే లోటును భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు.
ఆర్టీసీ కార్గో సేవలను మెరుగుపరచడంతో పాటు బస్టాండ్లో ఖాళీ స్థలాలు లీజుకు ఇవ్వడం, లగ్జరీ, అల్ ట్రా లగ్జరీ బస్సుల శాతాన్ని పెంచడం వంటి చర్యలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా కొంత మేర లోటు పూడ్చుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఓసారి ఉచిత ప్రయాణాలు ప్రారంభమయ్యాక స్పష్టంగా అంచనాలు తెలుస్తాయని, అప్పుడు మరిన్ని కొత్త మార్గాల్లో ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తామని అధికారుల చెప్తున్నారు.
































