భారతదేశంలోని జియో, ఎయిర్‌టెల్, వీఐతో సహా భారతీయ టెలికాం ఆపరేటర్లు ఇటీవల తమ మొబైల్ టారిఫ్ ప్లాన్‌లను పెంచాయి. ఈ పెరిగిన ప్లాన్‌లు జూలై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రతి టెలికాం ఆపరేటర్ ప్రస్తుతం ఉన్న ధరలకంటే 25 శాతం వరకు పెంపును ప్రకటించారు. మొబైల్ ఏఆర్‌పీఐ తక్కువగా ఉండడం వల్ల ధరలు పెంచాల్సి వచ్చిందని టెలికాం కంపెనీలు ప్రకటించాయి. ప్లాన్‌ల పెంపుతో జియో, ఎయిర్‌టెల్ కూడా 5జీ ఇంటర్నెట్ స్పీడ్ లభ్యతపై పరిమితులను ప్రకటించాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ మాత్రమే 5 జీ సేవలను అందిస్తున్నాయి. అయితే ఇకపై 2 జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ అందించే ప్లాన్‌లతో మాత్రమే 5జీ డేటా అందుబాటులో ఉంటుందని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కంపెనీల్లో ఏ కంపెనీ చౌకగా 5జీ ప్లాన్స్ అందిస్తున్నాయో? ఓసారి తెలుసుకుందాం.
జియో 5జీ ప్లాన్
రిలయన్స్ జియో తన చౌకైన 5జీ ప్లాన్‌ను రూ. 349కి అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో మొత్తం 56 జీబీ డేటా అలవెన్స్‌ను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాను ఆస్వాదించవచ్చు. ఆ తర్వాత వేగం 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అదనంగా ఈ ప్లాన్‌లో 5 జీ డేటా యాక్సెస్ ఉంటుంది. 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ వినియోగాన్ని అనుమతిస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అనేక కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు జియో టీవీ, సినిమా, క్లౌడ్ యాక్సెస్‌ను పొందవచ్చు.
ఎయిర్‌టెల్ 5 జీ ప్లాన్
ఎయిర్‌టెల్‌కు సంబంధించిన చౌకైన 5జీ ప్లాన్ ధర రూ. 379 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ప్లాన్ 1 నెల వాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ రోమింగ్ కాల్స్ సదుపాయం అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌తో అపరిమిత 5జీ డేటా వంటి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇది ప్లాన్ ద్వారా డేటా పరిమితిని మించి 5జీ నెట్‌వర్క్ ప్రాంతాలలో ఉపయోగించవచ్చు. అలాగే వినియోగదారులు ఒక ఉచిత హలో ట్యూన్‌ను పొందవచ్చు. అదనంగా వినియోగదారులు ఎయిర్‌టెల్‌కు సంబంధించిన వింక్ ద్వారా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.