Tollywood Actors in Politics: సినీ ఇండస్ట్రీకి పాలిటిక్స్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమాల్లో తమ నటనతో ప్రేక్షకులను అలరించిన ఎందరో సినీ తారలు.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వెండితెరను ఏలిన అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారు. కొందరు సొంతంగా పొలిటికల్ పార్టీని స్థాపించి ప్రజా సేవ చేస్తే, మరికొందరు మాత్రం జనాదరణ ఇతర పార్టీలలో జాయిన్ అయి రాజకీయాలు చేశారు. ఇప్పుడు లేటెస్టుగా యువ హీరో సిద్ధార్థ్ రాజకీయాల్లో ప్రవేశించిన నేపథ్యంలో, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చిన యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఎన్టీఆర్
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపించి, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజీవ్ గాంధీ మరణం అనంతరం రాజకీయాలకు దూరమయ్యారు.
కృష్ణంరాజు
రెబల్ స్టార్ కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ తరపున కాకినాడ నియోజకవర్గం నుండి గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. అలానే వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుతంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. సీనియర్ నటుడు జగ్గయ్య లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడుగా నిలిచారు. 1967లో ఆయన ఒంగోలు నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత జనాలకు ఆశించిన స్థాయిలో దగ్గరకాలేకపోయారు.
జమున.. జయప్రద..
1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజమండ్రి ఎంపిగా గెలిచిన సీనియర్ నటి జమున.. ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయల నుండి తప్పుకున్నారు. కొన్నేళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. అలనాటి అందాల తార జయప్రద అప్పట్లో రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరి, చంద్రబాబు నాయుడు పాలనలో రాజ్యసభకు ఎన్నికైంది. అయితే పార్టీ నాయకులతో వచ్చిన విబేధాల కారణంగా టీడీపీకి రాజీనామా చేసి, సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆంధ్ర నా జన్మ భూమి, కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో రాంపూర్ నియోజవర్గము నుండి లోక్ సభకు ఎన్నికైంది. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. కానీ, ఇప్పటికీ తనదైన ముద్ర వేసుకోలేదు.
జయసుధ
మరో సీనియర్ నటి జయసుధ కూడా రాజకీయ నాయకురాలిగా తన లక్ పరీక్షించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీలో చేరిన ఆమె.. గతేడాది బీజేపీలో జాయిన్ అయ్యారు. కానీ.. రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగలేకపోయారు.
విజయశాంతి
1998లో రాజకీయాల్లోకి వచ్చిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి.. మొదట భారతీయ జనతా పార్టీలో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో ‘తల్లి తెలంగాణ పార్టీ’ ఏర్పాటు చేసింది. అనంతరం ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి, మెదక్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా గెలిచింది. పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయింది. గతేడాది బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరింది. అప్పుడప్పుడు అకస్మాత్తుగా ప్రత్యక్షమై మాయవుతూ ఉంటారు. అందుకే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించలేకపోయింది.
మోహన్ బాబు
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు టీడీపీ తరపున 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశారు. ఎన్టీఆర్ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న విలక్షణ నటుడు.. 2019లో వైఎస్సార్‌సీపీలో చేరి తనయుడు మంచు విష్ణుతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రచారం చేసారు. అయితే ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉండటం లేదు.
నరేష్
సీనియర్ నటుడు వీకే నరేష్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన, హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు 1999లో బీజేపీ తరపున విజయవాడ ఈస్ట్ నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. వయస్సు మీదపడటంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
వేగంగా వచ్చి.. వెనక్కి తగ్గిన ఎన్టీఆర్, బాలయ్య ఒకే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తాత స్థాపించిన టీడీపీ కోసం 2009లో ప్రచారం చేసారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయాల వైపుకు తొంగి చూడలేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఒడిదుడుకుల్లో ఉన్న టీడీపీ కోసం బాలయ్య భవిష్యత్తులో చాలా చేయాల్సి ఉంది.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి, 2009 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో 295 స్థానాలకుగాను 18 స్థానాలను గెలుచుకున్నారు. రెండు శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన చిరు.. తిరుపతి నుంచి గెలిచి, పాలకొల్లులో ఓడిపోయారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి, రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. కేంద్ర పర్యాటక మంత్రి గా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. చిరంజీవి రాజకీయాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు.
పవన్ కళ్యాణ్
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ‘ప్రజారాజ్యం’ పార్టీలోని యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించి, 2014లో ‘జనసేన’ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజక వర్గాల నుండి పోటీ చేసిన పవర్ స్టార్.. రెండు స్థానాలలోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన ‘పవర్’ సాధిస్తారో లేదో చూడాలి.
బాబు మోహన్
సీనియర్ నటుడు బాబూ మోహన్ తెలుగుదేశం పార్టీ తరపున 1999లో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగ్స్ గెలిచి మంత్రిగా పనిచేశారు. 2004, 2014 లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ నుంటి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరి ఓడిపోయాడు. ఇటీవలే కేఏపాల్ ప్రజా శాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్.. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. అందుకే, ఆయనపై జంపింగ్ స్టార్ అనే ముద్రపడింది. ప్రస్తుతం సినిమాలు వదిలేసి ఆయన రాజకీయాల్లోనే బిజీగా ఉంటున్నారు. నిలకడగా ఉంటే మళ్లీ ప్రజాధారణ పొందే అవకాశం ఉంది.
నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు అటు అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో, ఇటు తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎలెక్షన్స్ లోనూ పోటీ చేయాలని భావించారు కానీ, పొత్తులో భాగంగా ఆయనకు సీటు దక్కలేదు.
అలీ
కమెడియన్ అలీ 1999లో తెలుగు దేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన మిత్రుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో జాయిన్ అవుతారని అందరు అనుకోగా, ఊహించని విధంగా జగన్ మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఉన్నారు.
మాధవిలత, తనీష్..
‘నచ్చావులే’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలలో నటించిన తెలుగు నటి మాధవి లత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. బీజేపీ పార్టీలో చేరి, 2019 ఎన్నికల్లో గుంటూరు నార్త్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ వైఎస్‌ఆర్‌సీపీలో జాయిన్ అయి, గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసారు. సినిమాల్లో సక్సెస్ అంతంత మాత్రమే ఉన్న.. వీరు భవిష్యత్తులో రాజకీయాల్లో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.
వీళ్లూ అంతే..
నటి హేమ 2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 2021లో భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది. యాంకర్ శ్యామల దంపతులు కూడా వైఎస్సార్సీపీలో ఉన్నారు. ‘ఆనంద్’ హీరో రాజా గత ఎన్నికల్లో జగన్ కోసం ప్రచారం చేసారు. ఇప్పుడు షర్మిల కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు లేటెస్టుగా యువ హీరో నిఖిల్ సిద్దార్థ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. లోకేష్ సమక్షంలో పార్టీ కండువ కప్పుకొని, తెలుగుదేశంలో అఫీషియల్ గా జాయిన్ అయ్యారు.