Business Idea: కేవలం రూ. 50వేలతో ఇంట్లో నుంచే వ్యాపారం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికన్నా ఎక్కువ సంపాదన.. వివరాలు ఇవి..

ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? ఇక ఏదైనా స్మార్ట్‌ బిజినెస్‌ చేయాలని ఆలోచిస్తు‍న్నారా? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలని భావిస్తున్నారా?
అయితే మీకో బెస్ట్‌ ఆప్షన్‌ ఉంది. అదే పుట్టగొడుగుల సాగు. మీకు కనుక వ్యవసాయంపై ఆసక్తి ఉంటే దీనిని మించిన బెస్ట్‌ ఆప్షన్‌ ఇంకోటి ఉండదు. వ్యవసాయం అంటే పొలం వెళ్లి, దుక్కి దున్ని, నీరు పెట్టాల్సిన పనిలేదు. అసలు పొలమే అవసరం లేదు. ఇంట్లోనే ఎంచక్కా సాగు చేపట్టవచ్చు. కేవలం రూ. 50,000లతో పూర్తి స్థాయిలో బిజినెస్‌ ప్రారంభించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..


ప్రస్తుతం ట్రెండీ వ్యాపారాల్లో లాభదాయకమైన ఆప్షన్‌ పుట్టగొడుగుల సాగు. ఇది పోషక, ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇటీవల కాలంలో అందరూ వీటిని అధికంగా తింటున్నారు. దీంతో డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతోనే రైతులు రెట్టింపు లాభాలు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం అనేకమంది విద్యావంతులు సైతం ఈ పుట్టగొడుగుల సాగు చేపట్టి విజయవంతం అవుతున్నారు.

ప్రత్యేక శిక్షణ అవసరం లేదు..
ఈ పుట్టగొడుగుల సాగునకు ఎటువంటి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. కనీస అవగాహన ఉంటే చాలు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. పుట్టగొడుగుల పెంపకాన్ని ఏడాది పొడవునా చేపట్టవచ్చు. అయితే శీతాకాలంలో అధిక పుట్టగొడుగుల ఉత్పత్తి సాధ్యమవుతుంది.

ఎంత సంపాదించవచ్చో తెలుసా..

పలువురు పుట్టగొడుగుల పెంపకందారులు చెబుతున్న దాని ప్రకారం కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో నాలుగు నుంచి ఐదు నెలల్లో సుమారు రూ. 3 నుంచి 3.5 లక్షల ఆదాయాన్ని ఈ సాగు ద్వారా ఆర్జించే అవకాశం ఉంది. పుట్టగొడుగుల వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవసరం అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టి దీన్ని ప్రారంభించవచ్చు. ప్రభుత్వం నుండి 40% వరకు సబ్సిడీ లభిస్తుంది.

సాగు ఇలా..
మీరు పుట్టగొడుల వ్యాపారం చేయాలనుకుంటే.. ముందుగా పుట్టగొడుగుల పెంపకంపై శ్రద్ధ వహించాలి. అన్ని వివరాలు తెలుసుకోవాలి. సాగులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నీ సక్రమంగా సాగితే.. చదరపు మీటరుకు 10 కిలోల పుట్టగొడుగులను సులభంగా సాగు చేయవచ్చు. కనీసం 40×30 అడుగుల స్థలంలో మూడు అడుగుల వెడల్పు గల మూడు రాక్‌లను ఏర్పాటు చేసి.. కవర్లలో పుట్టగొడులను పెంచవచ్చు.

కంపోస్టు తయారీ ఇలా..

ముందుగా కంపోస్టు తయారు చేసేందుకు వరి గడ్డిని నానబెట్టి కుళ్లిపోయేలా ఉంచాలి. ఆ తర్వాత డీఏపీ, యూరియా, పొటాష్, గోధుమ రవ్వ, జిప్సం, కార్బోఫుడోరాన్ కలపాలి. ఆ తర్వాత ఆవు పేడ పేడ, మట్టిని సమంగా కలిపి సుమారు ఒకటిన్నర అంగుళం మందం, రెండు నుంచి మూడు అంగుళాల మందంతో కంపోస్టు పొరను వేయాలి. కవర్లలో మొదట కంపోస్ట్ వేసి.. దానిపై పుట్టగొడుగుల విత్తనాలు వేయాలి. ఆ తర్వాత మళ్లీ కంపోస్ట్.. దానిపై విత్తనాలు చల్లాలి. ఇలా పొరలు పొరలుగా ఏర్పాటు చేయాలి. అందులో తేమను నిలుపుకోవటానికి రోజుకు రెండు నుంచి మూడు సార్లు నీళ్లు చల్లాలి. కొన్ని రోజుల్లోనే పుట్టగొడుగులు మొలకెత్తుతాయి.

శిక్షణ కావాలంటే..

పుట్టగొడుగుల పెంపకంపై సందేహాలు ఉంటే వ్యవసాయం కేంద్రాలను సంప్రదింవచ్చు. అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఇస్తారు. మీరు దీన్ని పెద్ద ఎత్తున సాగు చేయాలని ప్లాన్ చేస్తే… ఒకసారి సరిగ్గా శిక్షణ తీసుకోవడం మంచిది.