మీరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మీ జీర్ణవ్యవస్థపై ఏం జరుగుతుందో ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్స్ (ఒఖ్లా) సీనియర్ కన్సల్టెంట్-గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ డాక్టర్ సురక్షిత్ టీకే వివరించారు.
“బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం జీర్ణక్రియకు చాలా హానికరం. ఎందుకంటే ఇది జీవక్రియ రేటు (మెటబాలిజం)ను తగ్గిస్తుంది. కడుపులో ఎక్కువ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే మధ్యాహ్నం, రాత్రి వేళల్లో అధికంగా తినేలా చేస్తుంది. మంచి జీర్ణక్రియకు, ఆరోగ్యానికి బ్రేక్‌ఫాస్ట్‌తో మీ రోజును ప్రారంభించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే కలిగే 4 ప్రధాన సమస్యలు:
1. జీవక్రియ రేటు తగ్గిపోతుంది:
రాత్రి మొత్తం విశ్రాంతి తీసుకున్న తర్వాత మీ శరీరానికి ఉదయం శక్తి (ఫ్యూయల్) అవసరం. బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే మీ జీవక్రియ రేటు తగ్గిపోతుంది. సమతుల్య బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడి, రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మీరు బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే, మీ శరీరం శక్తిని ఖర్చు చేసే బదులు నిల్వ చేసుకోవడం మొదలుపెడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
2. యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది:
బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అదనపు యాసిడ్ కడుపులో నొప్పికి కారణమవుతుంది. అలాగే యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం మీరు ఏమీ తినకపోవడంతో, ఆహారం కోసం మీ కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఇది కడుపు లోపలి పొరను, ఆహార నాళాన్ని చికాకు పెడుతుంది.
3. ప్రేగుల ఆరోగ్యం దెబ్బతింటుంది:
మీ జీర్ణవ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తేనే అది ఆరోగ్యంగా ఉంటుంది. భోజనం మానేయడం, ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల జీర్ణక్రియ క్రమం దెబ్బతింటుంది. ప్రేగులు సజావుగా పనిచేయడానికి నిరంతరం ఆహారం అవసరం. లేకపోతే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే జీర్ణవ్యవస్థ బలహీనపడి కడుపు ఉబ్బరం, అజీర్తి, అక్రమ మలవిసర్జన వంటి సమస్యలు ఎదురవుతాయి.
4. తర్వాత ఎక్కువ తినేలా చేస్తుంది:
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే, మధ్యాహ్నానికి మీకు విపరీతంగా ఆకలి వేస్తుంది. దానివల్ల మధ్యాహ్నం లేదా రాత్రి భోజన సమయంలో ఎక్కువ తింటారు. ఒకేసారి అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు మొదలవుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి లేదా అసౌకర్యం కలుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెట్టి, రోజు మొత్తం తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ నియంత్రణలో ఉంటుంది.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.)
































