Vastu Tips: అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటున్నారా.? ఈ వాస్తు నియమాలు పాటించండి..

www.mannamweb.com


ఇంటి కొనుగోలు సమయంలో వాస్తును చూసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టెక్నాలజీ ఎంత మారుతోన్నా వాస్తును విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తింటి నిర్మాణం విషయంలో కాకుండా అప్పటికే నిర్మించిన ఇంటి విషయంలో కూడా వాస్తును చూస్తున్నారు.

భూముల ధరలు ఆకాశన్నంటిన ప్రస్తుత తరుణంలో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్స్‌ కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే అపార్ట్‌మెంట్‌ల విషయంలో కూడా వాస్తును పాటించాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ అపార్ట్‌మెంట్‌లు కొనుగోలు చేసే సమయంలో కూడా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంటికి ప్రధాన ద్వారం ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో డైనింగ్ టేబుల్‌ ఉండకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం నుంచి చూస్తే డైనింగ్ టేబుల్ కనిపించకూడదని సూచిస్తున్నారు.

* మీరు కొనుగోలు చేయాలనుకునే ఫ్లాట్‌లో వంట గది తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలని వాస్తు పండితులు సూచిస్తున్నారు. అలాగే వంట గదిలో స్టౌవ్‌ ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయం దిశలో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు.

* ఇక ఫ్లాట్‌లో మాస్టర్‌ బెడ్ రూమ్‌ నైరుతి దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే బెడ్‌రూమ్‌పై వాటర్‌ ట్యాంక్‌ లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

* అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఈశాన్యం దిశలో ఎక్కు ఖాళీ స్థలం ఉండడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈశాన్యం దిశ ఇరుకుగా ఉంటే వాస్తు దోషం ఏర్పడుతుందని అంటున్నారు.

* ఇక అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే విషయంలో చూడాల్సిన అంశం. ఎల్లప్పుడూ మెయిన్‌ డోర్‌ ఉత్తరం లేదు తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు ఉదయం లేవగానే వెంటిలేషన్‌ వచ్చేలా ఉండడం బెటర్‌.

* అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ విషయంలో తీసుకోవాల్సిన మరో జాగ్రత్త లివింగ్ రూమ్‌. ఫ్లాట్‌లో హాల్‌ ఉత్తరం లేదా ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి.

* టాయిలెట్స్‌ వాయువ్యం లేదా పడమర దిశలో ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో టాయిలెట్స్‌ ఉండకూడదని గుర్తు పెట్టుకోండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.