Cancer: క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ అయితే చాలా మంది గందరగోళానికి గురవుతారు. ఇది ప్రాణాంతక వ్యాధి అని, ఒకసారి వచ్చిందంటే కోలుకోవడం కష్టమనే అపోహలు పెట్టుకుంటారు.
ఇలాంటి అపోహలతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో క్యాన్సర్‌పై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎజిలస్ డయాగ్నోస్టిక్స్‌లో గ్లోబల్ రెఫరెన్స్ లాబోరేటరీ హెచ్‌ఓడీ, అసిస్టెంట్ డైరెక్టర్ డా.కునాల్ శర్మ వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధి గురించి వాస్తవాలు ప్రచారం చేయాలని ‘న్యూస్9లైవ్’తో చెప్పారు. బాధితులకు ఉండే 13 అపోహలు, అసలు నిజాల గురించి ఆయన వివరించారు.
క్యాన్సర్ నిజంగానే ప్రాణాంతక వ్యాధి?
క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. రెగ్యులర్ స్క్రీనింగ్స్ ద్వారా వ్యాధిని ఎర్లీగా గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. మోడర్న్ మెడిసిన్‌తో వ్యాధి నయం అవుతుంది. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్‌ల సర్వైవల్ రేటు 90 నుంచి 95 శాతంగా ఉండటం ఇందుకు ఒక ఉదాహరణ.
పొగరాయుళ్లకే లంగ్ క్యాన్సర్ వస్తుందా?
పొగరాయుళ్లకే లంగ్ క్యాన్సర్ వస్తుందనే అపోహ ఉంటుంది. స్మోకింగ్ లంగ్ క్యాన్సర్‌కి కారణమవుతుంది. కానీ, నాన్ స్మోకర్స్ కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. లంగ్ క్యాన్సర్లలో దాదాపు 10-20 శాతం మంది నాన్ స్మోకర్లే ఉంటున్నారు. పొగ పీల్చడం, రేడాన్ గ్యాస్, పర్యావరణ కాలుష్యం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి దారితీస్తాయి.
వంశపారంపర్యంగా క్యాన్సర్ వ్యాధి సోకడం?
అన్ని రకాల క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. వారసత్వం కారణంగా క్యాన్సర్ సోకే ముప్పు మాత్రమే పెరుగుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, కేవలం 5-10 శాతం క్యాన్సర్లు జెనిటిక్ మ్యుటేషన్స్ వల్ల సోకుతున్నాయి. ప్రధానంగా పర్యావరణం, జీవనశైలి క్యాన్సర్లకు కారకమవుతున్నాయి.
ఇ-సిగరెట్లు తాగితే క్యాన్సర్ రాదా?
ఇది కూడా అపోహే. ఇ-సిగరెట్లలోనూ హానికర పదార్థాలు ఉంటాయి. వీటిని తాగితే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. తద్వారా లంగ్ క్యాన్సర్‌కి దారితీయొచ్చు.
ఆల్కహాల్ ఫుల్లుగా తాగితేనే క్యాన్సర్ వస్తుందా?
ఆల్కహాల్ అతిగా తాగకున్నా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంటుంది. ఓ మోస్తరుగా తాగినా రొమ్ము, లివర్, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ముప్పు ఉంటుంది. తాగుబోతులకు మాత్రమే క్యాన్సర్ వస్తుందని అనుకోవడం అపోహే.
అంతా ఐపోయాక స్మోకింగ్, డ్రింకింగ్ మానేస్తే ప్రయోజనం ఉండదా?
స్మోకింగ్, డ్రింకింగ్ ఏ సమయంలోనైనా మానేయచ్చు. ఎంత ఆలస్యమైనా సరే మానేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మెరుగు పడుతుంది. తీవ్ర దుష్పరిణామాలు ఉండవు.
గంజాయి సిగరేట్ తాగితే క్యాన్సర్ రాదా?
గంజాయిలోనూ క్యాన్సర్ కారక కార్సినోజెన్లు ఉంటాయి. వీటిని తాగితే లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
క్యాన్సర్ వ్యాధి కన్నా చికిత్సనే ఇబ్బందిగా ఉంటుందా?
క్యాన్సర్ చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీంతో వ్యాధి వల్ల కలిగే నొప్పికన్నా ట్రీట్‌మెంట్‌తో ఎక్కువ బాధ కలుగుతుంది. అయితే, అడ్వాన్స్‌డ్ థెరపీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి మారింది. నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసి చికిత్స చేసే ఫెసిలిటీ ఉంది. దీంతో ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం జరగదు. త్వరగా క్యాన్సర్‌ని గుర్తిస్తే సైడ్ ఎఫెక్ట్స్ సమస్య నుంచి బయటపడొచ్చు.
షుగర్ కంటెంట్ క్యాన్సర్‌కి కారకం అవుతుందా?
సాధారణ కణాలతో పోలిస్తే క్యాన్సర్ కణాలు అధిక గ్లూకోజ్ పీల్చుకుంటాయి. అయితే, క్యాన్సర్ కణాలు పెరగడానికి షుగర్ కంటెంట్ కారణమని చెప్పడానికి సరైన ఎవిడెన్స్ లేదు. కాకపోతే, ఎక్కువ మోతాదులో షుగర్ కంటెంట్ తింటే ఊబకాయం వస్తుంది. ఊబకాయం ఉంటే వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉంది.
క్యాన్సర్‌తో భరించలేని నొప్పి వస్తుందా?
అన్ని రకాల క్యాన్సర్లు నొప్పిని కలగజేయవు. వ్యాధి ముదిరితే తప్ప నొప్పి రాదు. కాబట్టి, లక్షణాలను పసిగట్టి ఎర్లీగా వ్యాధిని నిర్ధారిస్తే సరైన చికిత్సతో నయం చేసుకోవచ్చు.
ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ని నయం చేస్తుందా?
ప్రకృతి వైద్యంతో క్యాన్సర్ నయమవుతుందనే విషయంపై సరైన ఆధారాలు లేవు. సంప్రదాయ వైద్యం లక్షణాలను మాత్రమే మేనేజ్ చేస్తుంది. ప్రత్యామ్నాయ ట్రీట్‌మెంట్ ప్రారంభించే ముందు డాక్టర్‌ని సంప్రదించాలి.
వృద్ధులపైనే క్యాన్సర్ ప్రభావం ఎక్కువా?
వయసు మీరిన వారిపైనే క్యాన్సర్ ప్రభావం అధికంగా ఉంటుందనేది అవాస్తవం. క్యాన్సర్ ఏ వయసులోనైనా సోకుతుంది. వయసు పెరుగుతన్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది. ల్యూకేమియా, ఎముకల క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్ వంటివి చిన్నారుల్లోనూ వ్యాపిస్తున్నాయి.
సెల్ ఫోన్స్ క్యాన్సర్‌కి కారణం అవుతున్నాయా?
సెల్‌ఫోన్స్ వాడితే క్యాన్సర్ వస్తుందని కచ్చితంగా చెప్పలేం. దీనిపై లోతైన పరిశోధనలు జరగాలి. రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్ కార్సినోజెనిక్‌గా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే, దీనికి డైరెక్ట్ ప్రూఫ్ లేదు.