కుక్కలకు నిజంగానే దెయ్యాలు కనిపిస్తాయా.. అర్ధరాత్రి మొరుగుడి వెనుక షాకింగ్ నిజం

నిశ్శబ్దంగా ఉన్న అర్ధరాత్రి.. దూరంగా ఎక్కడో ఒక్కసారిగా కుక్క మొరగడం మొదలవగానే చాలా మందికి లోపల ఏదో తెలియని భయం మొదలవుతుంది. ఏదో అశుభం జరగబోతోందా..


దెయ్యం తిరుగుతుందా.. అనే ఆలోచనలు మనసులో మెదులవుతుంది. చిన్నప్పుడు పెద్దలు చెప్పిన కథలు.. కొన్ని అనుభవాలు ఈ భయాన్ని మరింత పెంచుతాయి. కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని.. అవి మనకు కనిపించని ఆత్మలను చూస్తాయని చాలా మంది ఇప్పటికీ నమ్ముతూనే ఉన్నారు.

ప్రత్యేకంగా రాత్రిపూట వీధుల్లో కుక్కలు మొరగడం, ఒక్కసారిగా గుంపుగా తిరగడం చూస్తే.. నిజంగానే ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కొందరైతే ఆ సమయంలో ఇంటి తలుపులు కూడా గట్టిగా మూసేసుకుంటారు. మరికొందరు దేవుడి నామస్మరణ మొదలు పెడతారు. ఈ స్థాయిలో మన సమాజంలోకి ఈ నమ్మకం ఎక్కువైంది. కానీ నిజంగా కుక్కలకు భూతాలు కనిపిస్తాయా.. అవి మొరిగేది దెయ్యాలను చూస్తాయా.. అనే ప్రశ్నకు శాస్త్రం మాత్రం చాలా స్పష్టమైన సమాధానమే చెబుతోంది. కుక్కల కళ్ళు, చెవులు, ముక్కు.. ఇవన్నీ మనుషుల కంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా పనిచేస్తాయి. మనకు వినిపించని అతి సూక్ష్మ శబ్దాలు, మన కళ్లకు కనిపించని చిన్న కదలికలు కూడా వాటికి తక్షణమే తెలుస్తాయి. రాత్రి వేళల్లో వాతావరణం నిశ్శబ్దంగా ఉండటంతో చిన్న శబ్దం కూడా కుక్కలకు పెద్ద ప్రమాదంలా అనిపించవచ్చు. అటువంటి వేళ అవి అప్రమత్తం అవుతూ మొరగడం సహజం.

మరికొన్ని సందర్భాల్లో ఒంటరితనం, ఆకలి, భయం, లేదా దూరంగా ఏదైనా అనుమానాస్పద కదలిక కనిపించినప్పుడు కూడా కుక్కలు ఏడుస్తూ మొరుగుతాయి. ఇది వాటి సహజ రక్షణాత్మక స్వభావం. మన ప్రాంతంలో ఏదో జరుగుతోంది అని మిగతా కుక్కలకు హెచ్చరిక ఇవ్వడమే వాటి అసలు ఉద్దేశ్యం అని నిపుణులు చెబుతున్నారు.

అయితే మన సమాజంలో తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకాలు మాత్రం ఈ సహజ ప్రవర్తనను భూతాలు, దెయ్యాలు, మరణ సంకేతాలు అంటూ వక్రీకరించి మనలో భయాన్ని నాటాయి. కానీ ఇప్పటి వరకు కుక్కలు ఆత్మలను చూస్తాయని లేదా అవి మొరిగితే తప్పకుండా ఏదైనా చెడు జరుగుతుందని రుజువు చేసిన ఒక్క శాస్త్రీయ ఆధారమూ లేదు. నిజం ఏంటంటే.. కుక్కలు దెయ్యాలను కాదు, మనకు కనిపించని ప్రమాద సంకేతాలను మాత్రమే గుర్తిస్తున్నాయి. వాటి ఏడుపు వెనుక భయం ఉంది కానీ భూతాలు లేవు. ఇక మనం భయపడాల్సింది రాత్రి మొరిగే కుక్కల్ని కాదు.. మూఢనమ్మకాల్ని మాత్రమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.