ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా సీఎం జగన్ , మంత్రి విడుదల రజనీ (Vidadala Rajini) పేరుతో ఐవీఆర్‌ఎస్ ఫోన్లు వచ్చాయి. అయితే ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్‌కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు కూడా ఫిర్యాదు చేశారు.
జగన్, విడుదల రజనీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వైసీపీకు ఓటు వేయాలని వస్తున్న ఐవీఆర్ఎస్ ఫోన్లపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమ, పంచుమర్తి అనురాధ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
వీరిద్దరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఐవీఆర్‌ఎస్ వాయిస్ ఉన్న పెన్ డ్రైవ్‌ను కూడా ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేతలు అందజేశారు. ఈసీ ఫిర్యాదుపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైం నెంబర్ 249/24 కింద కేసు నమోదు చేశారు.
ఐపీసీలోని 188, 171f, 171h, ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని 123, 126, 130 సెక్షన్ల కింద మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఐవీఆర్‌ఎస్ కాల్స్ రావడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకున్నది. ఈసీ ఆదేశాల మేరకు జగన్, విడుదల రజనీపై పోలీసులు కేసు నమోదు చేశారు.