30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి పెళ్లి.. వరుడు కావాలంటూ ప్రకటన..

సాధారణంగా బతికున్న వారికే పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే ఈ ఊరిలో మాత్రం చనిపోయిన వారికి పెళ్లిళ్లు చేస్తారు. ఏంటి షాకయ్యారా? మరే ఇదే నిజం. అక్కడ ఇదే కల్చర్ అంట. ఎప్పుడో చనిపోయిన కూతుర్లకు పెళ్లి చేస్తారు. దానికోసం వరుడు కావాలని ప్రకటన ఇస్తారు. తాజాగా ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురికి వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చింది. కర్ణాటకలోని తుళునాడులో ఒక విచిత్రమైన సాంప్రదాయం ఉంది. అక్కడ ప్రజలు ఎప్పుడో కొన్నేళ్ల క్రితం చనిపోయిన తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. తుళు మాసం వచ్చిందంటే ప్రత్యేకించి మరీ ఈ వివాహాలు జరిపిస్తారు. తుళు మాసంలో పెళ్లిళ్లు తప్ప మరే ఇతర శుభకార్యాలను నిర్వహించరు.


ఈ క్రమంలో ఓ కుటుంబం చనిపోయిన తమ కూతురు పెళ్లి కోసం ఒక ప్రకటన ఇచ్చింది. ‘బంగేరా గోత్రం, కులూల్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయికి వరుడు కావాలి. అమ్మాయి 30 ఏళ్ల క్రితమే చనిపోయింది. అయితే అబ్బాయి 30 ఏళ్ల కిందట చనిపోయి ఉండాలి. మా కులానికి చెందిన వాడు, వేరే గోత్రం వాడు అయి ఉండాలి. 30 ఏళ్ల క్రితం చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు ప్రేతాత్మ పెళ్లి చేయడానికి ఇష్టమైతే సంప్రదించండి’ అంటూ ఫోన్ నంబర్ తో ఒక ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన వైరల్ అవ్వడంతో 50 మంది స్పందించారని ప్రకటన ఇచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. ఈ ప్రేతాత్మ వివాహా తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని అన్నారు.

ఈ వివాహం చేయడానికి ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామని.. సరైన సంబంధం కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ పెళ్లిని బతికున్న వారికి ఎలా చేస్తారో అలానే చేస్తారు. వధువు, వరుడి బొమ్మలను పీటల మీద కూర్చోబెట్టి.. వాటికి పెళ్లి బట్టలు ధరిస్తారు. గ్రాండ్ గా ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపిస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారో అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని ఇలా చేస్తారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చనిపోయిన బాధలోంచి బయటకు వచ్చి సంతోషంగా గడపడం కోసం ఇలా చేస్తున్నారని చెబుతున్నారు. తుళులో ఈ ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది.

బెంగళూరు: మరణించిన 30 ఏళ్ల తర్వాత వధువరులకు పెళ్లి జరిగింది. చనిపోయిన తర్వాత పెళ్లి ఏంటని ఆశ్చర్యపోవద్దు. పురాతన సంప్రదాయానికి చెందిన ఈ వింత పెళ్లిని అరుణ్ అనే ట్విటర్ యూజర్ వీడియోలతో సహా పోస్ట్‌ చేసి వివరించారు. కర్ణాటకలోని మంగళూరులో ఈ నెల 28న ఈ వివాహం జరిగింది. దక్షిణ కన్నడ సంప్రదాయం ప్రకారం చిన్నప్పుడే చనిపోయిన పిల్లలకు వారి తల్లిదండ్రులు 30 ఏళ్ల తర్వాత ఈ పెళ్లి తంతు నిర్వహిస్తారు. దీని కోసం ఈడు, జోడు కూడా చూసుకుంటారు. చిన్నప్పుడే మరణించిన మగ పిల్లాడికి సరైన ఈడు, జోడున్న చిన్నప్పుడే చనిపోయిన ఆడ పిల్ల కుటుంబాన్ని ఎంచుకుంటారు. ఇరు కుటుంబాలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకుని సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు. పెళ్లి ముహుర్తాలు నిర్ణయిస్తారు.

అనంతరం వేడుకగా పెళ్లి తంతు నిర్వహిస్తారు. పెళ్లి వేదికపై రెండు ఖాళీ కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వధువు కుటుంబం పట్టుచీర, వరుడి కుటుంబం ధోవతిని అందులో ఉంచుతారు. ఆ దుస్తులు ధరించేందుకు వధువరులకు కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాత చీర కొంగును, పంచెకు ముడి వేస్తారు. ఏడు అడుగుల బంధానికి శ్రీకారంగా ఆ దుస్తులను కుర్చీల చుట్టూ ఏడుసార్లు తిప్పుతారు.

ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జరుగుతుంది. దీని తర్వాత వధువరుల స్థానాలను మార్చుతారు. ఈ పెళ్లి తంతులో ఇరు కుటుంబాల వారు, బంధువులు జంటను ఆట పట్టిస్తారు. వారిపై జోకులు కూడా వేసుకుంటారు. అందరి ఆశీర్వాదం కోసం వధువరులను బయటకు తీసుకువస్తారు. చివరకు వధువును వరుడి కుటుంబానికి అప్పగించే అప్పగింతల కార్యక్రమంతో ఈ వింత పెళ్లి ముగుస్తుంది. అనంతరం మాంసాహారంతో విందు భోజనం పెడతారు. అయితే ఈ పెళ్లికి పిల్లలు, పెళ్లి కాని వారిని అనుమతించారు. 30 ఏళ్ల కిందట చిన్నప్పుడే చనిపోయిన చందప్ప, శోభల పెళ్లిని ఈ నెల 28న ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. ఈ పెళ్లి తంతు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.