పిన్నెల్లి అరెస్టుకు సీఈసీ డెడ్ లైన్ !

అమరావతి: పోలింగ్‌ రోజు ఈవీఎం, వీవీప్యాట్‌లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఈసీ పోలీసులను ఆదేశించింది.


మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం 202తోపాటు ఏడు కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన అన్ని వీడియో పుటేజీలను జిల్లా ఎన్నికల అధికారులు తమకు అందజేశారని, దీంతో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి చెప్పాలని సీఈఓ ముకేశ్‌ కుమార్‌ మీనాను ఆదేశించింది.

మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత చేసినా కేసు కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం వెంటనే స్పందించింది. సీఈవో ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు పంపింది. ఆ వీడియోలో ఉన్నది ఎమ్మెల్యే నా.. ఎమ్మెల్యే అయితే ఇంకా కేసు ఎందుకు పెట్టలేదు.. ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని స్పష్టం చేసింది. తక్షణం చర్యలు తీసుకుని ఐదు గంటల లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అంటే క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయాన్ని ఐదు గంటల కల్లా సీఈసీకి తెలియచేయాల్సి ఉంది. ఈ విషయాన్ని డీజీపీపి సీఈవో తెలియచేశారు. దీంతో పిన్నెల్లి అరెస్టుకు ప్రత్యేక బృందాల్ని హైదరాబాద్ కు పంపారు.
కానీ ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రత్యేక బృందాల సమాచారం ఆయనకు చేరుతూండటంతో.. ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నారు. ఐదు గంటలలోపు పిన్నెల్లిని అరెస్టు చేయలకపోతే వ్యవస్థలు మొత్తం విఫలమైనట్లే. వ్యవస్థల్లో ఉన్న మనుషుల ద్వారా తాను అనుకున్నట్లుగా చేయిస్తున్న వైసీపీ పెద్దలు పిన్నెల్లిని కాపాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్టు చేయలేకపోతే.. ఏపీలో వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో దేశానికి తెలుస్తుంది.