ఆకాశానంటుతున్న కంచి పట్టు చీరల ధరలు..రెండేళ్లలో 50 శాతం పెరుగుదల!

కాంచీపురం చేనేత పట్టుచీరలు ప్రపంచప్రసిద్థిగాంచినవి. కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఈ పట్టుచీరల ధర ఇప్పుడు 50 శాతం పెరిగాయి. వెండి, బంగారం ధర రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతుండటంతో దాని ప్రభావం చీరల ధర పై పడుతుంది.


ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌ కావటంతో కాంచీపురం పట్టు చీరలను కొనుగోలు చేసేందుకు పెళ్లి వారు పరిగెడుతుంటారు. కానీ, ఆకాశాన్నంటుతున్న బంగారం ధరల కారణంగా చీరలుధరలు పెరగటంతో వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. కాంచీపురం పట్టు చీరల ధర గత ఎనిమిది నెలల్లో 50% పెరిగింది.దీని వలన ధరపై అవగాహన ఉన్న వినియోగదారులు తక్కువ బంగారం , వెండి కంటెంట్ లేదా రెండు విలువైన లోహాలు లేని చీరలను కొనుగోలు చేయటం ప్రారంభిస్తున్నారు.

చాలా మంది కస్టమర్లు నిర్దిష్ట బడ్జెట్‌తో వస్తారని తక్కువ బంగారం,వెండితో కూడిన (కాంచీపురం) పట్టు చీరలను ఇష్టపడతారని టెక్స్ టైల్స్ యజమానులు చెబుతున్నారు. అయితే కొందరు తమ బడ్జెట్‌కు తగ్గట్టుగా చీరలను ఆర్డర్ చేసేవారని ఇంతలో పట్టు చీరల ధర పెరగడంతో వారు కొనుగోలు పై వెనక్కి తగ్గుతున్నారని..దీని ప్రభావం నేత నేసిన వారిపై అమ్మకాలు జరిపే మా పై పడుతున్నాయని వారు అన్నారు.

అక్టోబర్ 1, 2023న 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము 5,356 నుండి ఉండేదని..మే 21, 2024 నాటికి గ్రాము 6,900కి పెరిగిందన్నారు.అదేవిధంగా, వెండి ధరలు కూడా అదే సమయంలో గ్రాముకు 75.5 రూపాయల నుండి 101కి పెరిగింది. ఈ పెరుగుదలతో కాంచీపురంలో రూ. 10,000 కోట్ల పట్టు చీరల పై ప్రభావం చూపిందన్నారు.
కాంచీపురం పట్టు చీరల తయారీదారుల సంఘం వీకే ధమోదరన్ మాట్లాడుతూ.. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ మే వరకు చీరల ధరలు 40%-50% పెరిగాయి. “కాంచీపురం సిల్క్ చీర ధర ప్రధానంగా బంగారం, వెండి ధరల ద్వారా నిర్ణయించబడుతుంది, ఎందుకంటే రెండు లోహాలను పట్టు చీరలలో వాడటానికి ఉపయోగిస్తారు. చేనేత కాంచీపురం పట్టు చీర తక్కువ ధరకు లభించకపోవటంతో బంగారం, వెండి మిశ్రమం లేని ‘జారీ’తో కొనుగోలు చేయడం కొనుగోలు దారులు ప్రారంభించారన్నారు. ఇది మా వ్యాపారస్తులపై నేత కార్మికులపై పెను ప్రభావం చూపుతోంది ” అని ఆయన చెప్పారు.