చాయ్ వాలా కూతురు సీఏ పాసైంది.. ఆ తండ్రి కళ్లల్లో ఆనందం చూశారా?

www.mannamweb.com


టీ అమ్ముకుంటూ కుటుంబాన్ని లాక్కొస్తున్న ఓ తండ్రి తన కుమార్తెను సీఏ చదివించాడు. సీఏ సాధించిన కూతురు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంటే ఆ కన్నతండ్రి కళ్లు చెమ్మగిల్లాయి.

మురికివాడలో జీవనం. టీ బండి నడిస్తే కానీ, కదలని బతుకు బండి. అలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఎవరైనా కుమార్తెను చదివించటం శక్తికిమించిన పనే. చేతికి అందివచ్చిన కుమార్తెను పనిలో పెడితే చేదోడువాదోడుగా ఉంటుందని అనుకుంటారు. కానీ, దిల్లీ (Delhi) శివార్లలో జీవనం సాగించే అమిత ప్రజాపతి (Amita Prajapati) తల్లిదండ్రులు మాత్రం అలా ఆలోచించలేదు. ఎలాగైనా తన కుమార్తెను ప్రయోజకురాలిని చేయాలనుకున్నారు. ఉండటానికి ఇల్లు లేకపోయినా.. ప్రతి రూపాయి కూడబెట్టి ఆమెను చదివించారు. అమిత కూడా సీఏ (CA) పూర్తి చేయడానికి ఓ యుద్ధమే చేసింది. పట్టు వదలకుండా 10 ఏళ్లపాటు సాగిన ఆమె పోరాటం ఫలించింది. తాజాగా సీఏ పూర్తి చేసేసరికి వారి ఆనందానికి అవధుల్లేవు. సీఏలో ఉత్తీర్ణత సాధించిన కూతురు వచ్చి ఆప్యాయంగా కౌగిలించుకుంటే పుత్రికోత్సాహంతో ఆ కన్నతండ్రి కళ్లు చెమర్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.