నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతిఏటా నోటిఫికేషన్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ ఉత్సవ్ సభ ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైన 15,941 అభ్యర్థులకు నియమాక పత్రాలను అందజేశారు.


కొద్దిసేపు టీచర్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అనంతరం సభను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఇకపై ప్రతిఏటా DSC నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని నిరుద్యోగులకు శభవార్త చెప్పారు. ఏపీలో చేతకాని పక్షం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి చేయదు.. మంచి జరుగుతుంటే ఓర్వలేదని ఆరోపించారు. గతంలో పోస్టింగుల కోసం పైరవీలు చేసే పరిస్థితిని గుర్తు చేశారు. కానీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిభ ఆధారంగానే పోస్టింగులు వచ్చాయని చెప్పారు. వైసీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియం పేరుతో విద్యావ్యవస్థ నాశనం అయ్యిందని చంద్రబాబు మండిపడ్డారు.

తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే పెట్టానని చంద్రబాబు తెలిపారు. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న వారిని అభినందించారు. అవినీతి లేకుండా.. పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టి.. టీచర్ల పోస్టింగ్ ఇచ్చామన్నారు. బాబు షూరిటీ.. జాబ్ గ్యారెంటీ అని చెప్పాను.. దాన్ని నిజం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. వాటి ద్వారా నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్లల్లో 14 సార్లు డీఎస్సీని పెట్టి 1,96,619 ఉద్యోగాలిచ్చామన్నారు. ప్రతి ఏడాది డీఎస్సీ ఉంటుందని.. నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉండాలని ఆయన సూచించారు. డీఎస్సీని అడ్డుకునేందుకు 106 కేసులు వేశారని మండిపడ్డారు. అన్ని ఇబ్బందులను అధిగమించి డీఎస్సీ నిర్వహించిన లోకేష్ టీమ్ ను చంద్రబాబు అభినందించారు.

మహిళలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చామని, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని సూపర్ జీఎస్టీ తెచ్చారని, ధరలు తగ్గించారని పేర్కొన్నారు. విద్యా రంగంలో సంస్కరణలు తెస్తున్నామని, సన్న బియ్యంతో రుచికరమైన మధ్యాహ్నా భోజనం అందిస్తున్నామని వివరించారు. పేరెంట్ టీచర్లు మీటింగులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మన బడి-మన భవిష్యత్ పేరుతో మౌళిక సదుపాయాల కల్పన చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. టీచర్ల బదిలీల చట్టంతో పారదర్శకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా బదిలీలు పూర్తి చేశామని ధీమా వ్యక్తం చేశారు. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా.. ప్రతి ఒక్కరికీ రూ.15వేలు చొప్పున ఇచ్చామన్నారు.

నారా లోకేష్ నో బ్యాగ్ డే విధానం తెచ్చారని, ఇది వినూత్నంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఈసారి స్కూళ్లు తెరిచేలోగానే స్కూల్ కిట్లు, పుస్తకాలు ఇచ్చామని పేర్కొన్నారు. అభివృద్ధితో ఉద్యోగాలు వస్తాయని, ఆదాయం పెరుగుతుందన్నారు. తద్వారా సంక్షేమం సజావుగా సాగించవచ్చని వివరించారు. విలువలతో కూడిన విద్యను అందించేలా టీచర్లంతా పని చేయాలని ఆయన సూచించారు. పిల్లల్లో నైతిక విలువలను పెంచేలా టీచర్లు పాఠాలు చెప్పాలని తెలిపారు. పిల్లల్లో నైపుణ్యాలు పెంచే బాధ్యత టీచర్లు తీసుకోవాలని ఆదేశించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా టీచర్లు అప్డేట్ అవుతూ ఉండాలన్నారు. భవిష్యత్తులో విద్యా రంగంలో ఎలాంటి మార్పులు రాబోతాయో టీచర్లు ఊహించగలగాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

తాను నిత్య విద్యార్థినని.. కొత్త విషయాలు నేర్చుకుంటానని సీఎం చంద్రబాబు తెలిపారు. అవి ప్రజలకు ఉపయోగపడతాయనుకుంటే వాటిని అమలు చేస్తానని స్పష్టం చేశారు. 2019-24 మధ్య కాలం విద్యా వ్యవస్థకు ఓ శాపమని ఆరోపించారు. 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విద్యా రంగాన్ని 19వ స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చాయని అన్నారు. నో అడ్మిషన్లు బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తెచ్చామని ధీమా వ్యక్తం చేశారు. ఇది మరింతగా పెరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. విద్యాశాఖ కఠినంగా ఉంటుందని చెప్పానని.. అయినా లోకేష్ ఛాలెంజింగ్ గా తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రాథమిక విద్య బాగుంటే ఉన్నత చదువులు అద్భుతంగా ఉంటాయని, దీంతో అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.