ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అయినా పలు విషయాల్లో ఇంకా దూకుడు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగుల నుంచి కూడా ఆశించినంత సహకారం లభించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇవాళ విజయనగరం జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు చేశారు.
గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం చేపట్టామని తెలిపారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును కూడా గత పాలకులు ఆలస్యం చేశారన్నారు. కూటమి అధికారంలోకి వస్తూనే ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నట్లు తెలిపారు. 2026 ఆగస్టుకు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని, ప్రతీ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సంక్షేమం ఇవ్వడమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందన్నారు. చివరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు కష్టాలు లేని ఇబ్బందులు లేని సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. లంచాలు లేకుండా ప్రజలకు సుపరిపాలన అందించే బాధ్యత తీసుకున్నట్లు తెలిపారు. వాట్సప్ ద్వారా పౌరసేవలు అందిస్తున్నాం, రహదారులను కూడా బాగు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇచ్చే సంక్షేమ, చేసే అభివృద్ధి వల్ల ఆర్ధికంగా వృద్ధిలోకి వచ్చిన వారు సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. పీ4 ద్వారా 1 లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తెస్తారన్నారు. ఆర్ధిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికే పీ4 కార్యక్రమం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఆడబిడ్డలకు స్వేచ్ఛ, రక్షణ కల్పించటంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదని, బాగా పనిచేయకపోతే గతంలో తిట్టేవాడిని ఇప్పుడు ప్రజల ముందు నిలబెడతానన్నారు.
































