ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగాల పేర్ల మార్పు..! కీలక ఉత్తర్వులు..

పీలో లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అయితే వారు నిర్వర్తిస్తున్న విధుల ఆధారంగా దశాబ్దాల క్రితం ఖరారు చేసిన పోస్టుల పేరుతోనే వారిని ఇప్పటికీ పిలుస్తున్నారు.


ప్యూన్లు, వాచ్ మెన్లు, అటెండర్లు ఇలా వందల సంఖ్యలో అభ్యంతరకర పేర్లు ఉన్నాయి. అయితే ఈ పేర్లను సృష్టించిన సమయంలో వీటిపై అంతగా అభ్యంతరాలు లేవు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి వ్యక్తుల గౌరవ మర్యాదలకు ఇవి భంగం కలిగిస్తున్నాయన్న భావన ఉంది. దీంతో ఆయా పేర్ల మార్పుకు ప్రభుత్వం సిద్దమవుతోంది.

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న వందల పోస్టులకు ఇలా అభ్యంతరకర పేర్లు ఉన్నాయి. వాటితో ఆయా ఉద్యోగులను పిలవడం ఇతరులకు కూడా ఇబ్బందిగానే ఉంటోంది. ఇందులో ప్యూన్లు, అటెండర్లు, వాచ్ మెన్లు, ప్లంబర్లు, స్కావెంజర్లు, ఫిట్టర్లు, చౌకీదార్లు వంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. అయితే మారుతున్న కాలంతో పాటు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగం ప్రకారం ప్రతీ పౌరుడికీ గౌరవంగా జీవించేందుకు ఉన్న హక్కు వంటి ఎన్నో విషయాల్ని దృష్టిలో ఉంచుకొని ఈ పేర్ల మార్పుకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.

తాజాగా గతనెలలో సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఎస్ విజయానంద్ అధికారులకు తాజాగా ఆయా పోస్టుల పేర్ల మార్పుపై అధ్యయనం చేసి నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దాదాపు 20 శాఖల్లో పేర్లు మార్చాల్సిన పోస్టుల జాబితాను సాధారణ పరిపాలన శాఖ సిద్ధం చేసింది. ఇందులో అత్యధికంగా పోలీసు, వైద్యారోగ్యం, సాధారణ పరిపాలనశాఖలోనే ఉన్నాయి. దీంతో వీటి మార్పు కోసం తాజాగా జీవో జారీ చేశారు.

ప్రభుత్వం తాము జారీ చేసిన జీవోలో ఉన్న పేర్లతో పాటు లేని పేర్లను కూడా వారం రోజుల్లో తమ దృష్టికి తీసుకురావాలని సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. అనంతరం మూడు వారాల్లో ఈ పేర్ల మార్పు ప్రక్రియను ఆమోదించి కొత్త పేర్లతో జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇలా పోస్టుల పేర్లు మారే వాటిలో ప్రభుత్వ శాఖలతో పాటు కార్పోరేషన్లు, సొసైటీలు, బోర్డులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్దలు కూడా ఉన్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.