చికెన్ చింతామణి ఎప్పుడైనా తిన్నారా.. రుచి అమోఘం.. ఎలా చేసుకోవాలంటే?

www.mannamweb.com


చికెన్‌తో చేసినా ఏ వంటకమైనా అందరికీ నచ్చేస్తుంటుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరూ చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

చికెన్‌తో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అయితే ఈరోజు మేము మీకోసం సరికొత్త రెసిపీని తీసుకొచ్చాము. అదే చికెన్ చింతామణి. దీనిని తమిళనాడులో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ చికెన్ చింతామణిని ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చికెన్ చింతామణి తయారీకి కావాల్సిన పదార్థాలు

కిలో చికెన్
పది ఎండుమిర్చి
ఒక కప్పు ఉల్లిపాయ తరుగు
సరిపడేంత నూనె
ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
ఒక స్పూన్ మిరియాల పొడి
ఒక స్పూన్ సోంపు పొడి
రుచికి సరిపడా ఉప్పు
చిటికెడు పసుపు
గుప్పెడు కరివేపాకులు
చిటికెడు ఇంగువ
కొద్దిగా కొత్తిమీర
చికెన్ చింతామణి తయారీ విధానం

ఈ చికెన్ చింతామణి చేసుకునేందుకు ముందుగా మనం తీసుకున్న కిలో చికెన్‌ను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి. అందులో కరివేపాకులు, పది ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. వాటన్నిటినీ కాసేపు వేయించుకోవాలి.

ఆ తరువాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అల్లం వేసుకునేటప్పుడు చిన్న మంట మీద ఉంచితే అల్లం మాడిపోకుండా ఉంటుంది.

అల్లం పచ్చి వాసన పోయిన తరువాత అందులో చికెన్ ముక్కలను వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని చికెన్‌కు ఉల్లిపాయ, ఎండుమిర్చి, ఇంగువ అల్లం పట్టుకునే వరకు కలుపుకోవాలి. ఆ తరువాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి.

ఆ తరువాత మూత తీసి కొంచెం పసుపు, కొంచెం సోంపు పొడి వేసుకోవాలి. అలాగే మిరియాల పొడిని కూడా చల్లుకోవాలి. మిరియాల పొడిలోని ఘాటు, ఎండుమిర్చిలోని కారం దీనికి సరిగ్గా సరిపోతాయి. పైనుంచి అదనంగా కారం వేయాల్సిన అవసరం లేదు. గ్రేవీ కావాలనుకునే వారు కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. వేపుడు మాదిరిగా కావాలనుకునే వారు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు ఆ చికెన్‌పై మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తరువాత మూత తీసి దానిపై గుప్పెడు కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ చింతామణి సిద్ధమైనట్లే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. మీరుకూడా ఓసారి ట్రై చేసి చూడండి.