గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమీక్షలో విస్తృతంగా చర్చించారు. సమీక్ష ప్రారంభానికి ముందు వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మాట్లాడిన సీఎం.. తన హయాంలో మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తనకు లభించిన అదృష్టమని వ్యాఖ్యానించారు.
గోదావరి ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లతో పాటు.. మరో 139 ఘాట్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మొత్తంగా నదీ తీరం వెంబడి వివిధ ప్రాంతాల్లో 9,918 మీటర్ల పొడవునా 373 ఘాట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు, భద్రత, పారిశుధ్యం, తాగునీరు, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
దేశ విదేశాల నుంచి సుమారు 10 కోట్ల మంది భక్తులు గోదావరి పుష్కర స్నానం కోసం రాష్ట్రానికి వచ్చే తరలివచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నిర్వహణ రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన అంశమని, ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాశ్, కందుల దుర్గేశ్, బీసీ జనార్ధన్ రెడ్డి సహా చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


































