3 ఏళ్ల వయసు నుంచే పిల్లలను స్కూల్‌కు పంపించాలి: సుధామూర్తి

చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి (Sudha Murty) కొన్ని సూచనలు చేశారు. ప్రీ ప్రైమరీ విద్యపై తల్లిదండ్రులు, ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. ‘‘చిన్న వయసులోనే బ్రష్‌ చేసుకోవడం, స్వయంగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం వంటివి నేర్పించాలి. పాఠశాలకు వెళ్లే అలవాటు త్వరగా ప్రారంభం కావాలి. ఇదంతా చదువు ఒత్తిడి పెంచడం కోసం కాదు. వారికంటూ ఒక దినచర్య ప్రారంభమవుతుంది. క్రమశిక్షణ అలవాటవుతుంది. చిన్నారి జీవితంలో ఈ ప్రారంభ రోజులే.. నేర్చుకోవడం, ఆలోచనా శక్తి, ఈ ప్రపంచంతో మమేకమవడం వంటి వాటిని తీర్చిదిద్దుతాయి. చిన్న వయసులో నేర్చుకున్న ఈ అలవాట్లు తర్వాత శాశ్వతంగా ఉండిపోతాయి’’ అని ఆమె సూచనలు చేశారు.


రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఆరు నుంచి 14 సంవత్సరాల వయసు వారికే ప్రభుత్వం ఉచితవిద్య అందించాల్సి ఉంటుంది. మూడు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న పిల్లలకు కూడా ఈ హక్కు ఉండాలని ఆమె పార్లమెంట్‌ వేదికగా కోరారు. ఆ సమయంలోనే ఆమె చేసిన సూచనలు వైరల్ అవుతున్నాయి. ‘‘పిల్లలు మన భవిష్యత్తు. వారు ఉదయించే సూర్యుడివంటివారు. ఈ ప్రారంభ విద్య (Early education) వారి జీవితానికి ఉపయోగపడుతుంది’’ అని ఆమె మాట్లాడారు. మూడేళ్ల నుంచే అది అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అందుకు తగ్గట్టుగా రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు గల కారణాన్ని వివరించారు. పిల్లల మెదడులో 85 శాతం ఎదుగుదల ఆరేళ్లకు ముందే జరుగుతుందని, అందుకే ఈ వయసు కీలకమన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.