అక్షర క్రమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో సైతం ఆ స్థానంలో నిలిపేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అలాగే దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంది. దీంతో రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
అదే విధంగా రాష్ట్రంలో ఆదాయం పెరుగుదల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు.. లోతైన అధ్యయనంతోనే రాష్ట్ర ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోందని స్పష్టం చేశారు. మంగళవారం రాజధాని అమరావతిలో ఉన్నతాధికారులతో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా ఈ ఏడాది రూ.1,34,208 కోట్ల ఆదాయం లక్ష్యమని తెలిపారు. 30 ఏళ్ల ఫలితాల ఆధారంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక సాంకేతికత వినియోగం ద్వారా పన్ను ఎగవేతలకు చెక్ పెట్టవచ్చునని చెప్పారు. అంతర్జాతీయంగా ఎర్ర చందనం విక్రయాలకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో నిరోధించాలన్నారు. అందుకు తగినట్లుగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బంగారం కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని.. కానీ పన్ను ఆదాయం మాత్రం ఆ స్థాయిలో లేదని ఆయన పెదవి విరిచారు. ఈ విషయంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
కర్ణాటక, తమిళనాడులలో ఆర్టీసీ ఆదాయం పెరుగుతున్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఎందుకు పెరగడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లేని లోటు మన రాష్ట్రం పూడ్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
ఇక మరోవైపు.. ఐటీ ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖలపై మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్దంగా వున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ఆయన పేర్కొన్నారు.
వేగవంతంగా యూనిట్ల స్థాపనకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఐటి,ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మే నెలాఖరుకు మన మిత్రా ద్వారా 400 సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల యాప్‌లు, జీవోలు సింగిల్ ఫ్లాట్ ఫాం మీదకు తీసుకురావాలని ఉన్నతాధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
































