కాఫీ రూ.350.. పాప్‌కార్న్ రూ.600: మండిపడ్డ శివాజీ

టికెట్ రేట్ల గురించి డిబేట్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. దాని కంటే ఎక్కువగా… థియేటర్లలో తినుబండారాలపై జరుగుతున్న దోపిడీ గురించి నిర్మాతలు గళం ఎత్తుతున్నారు.


సగం జనం ఈ రేట్లకు భయపడే థియేటర్లకు రావడం లేదన్నది వాళ్ల వాదన. ఇందులో నూటికి నూరుశాతం నిజం వుంది. తాజాగా నటుడు, నిర్మాత శివాజీ థియేటర్లలో జరుగుతున్న దోపిడీ గురించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ దోపిడీని వ్యవస్థలే నివారించాలని, న్యాయస్థానాలు కలగజేసుకోవాలని కోరారు.

మల్టీప్లెక్స్ లో కాఫీ మూడొందల యాభై రూపాయలకు అమ్ముతున్నారని, పాప్ పార్న్ పేరుతో ఆరొందలు గుంజుతున్నారని, ఆ మూడొందల యాభైతో మూడు రోజులు ఇంటిల్లిపాదీ కాఫీ తాగొచ్చని, ఈ దోపిడీలో నిర్మాతలకు భాగం లేదని, కేవలం మల్టీప్లెక్స్ యజమానులే లాభపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ లాంటి నటుడే.. థియేటర్లో రేట్లకు ఇలా భయపడిపోతోంటే సామాన్యుల సంగతేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివాజీలా… చిత్రసీమ మొత్తం ఈ దోపిడీ గురించి గొంతు విప్పాల్సిన అవసరం వుంది. ‘అమరావతి గురించి ఉద్యమం చేసినట్టు.. థియేటర్లో జరుగుతున్న దోపిడీ గురించి కూడా ఉద్యమం చేయొచ్చు కదా’ అని పాత్రికేయులు అడిగితే… శివాజీ నవ్వుతూ సమాధానం దాటేశారు. ‘మీరంతా ఉన్నారు కదా.. మీతో పాటు నేను కూడా జై కొడతా’ అని లైట్ తీసుకొన్నారు. ఆమధ్య ఐబొమ్మ రవి గురించి కూడా శివాజీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఐబొమ్మ రవి తెలివితేటల్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాలని ఆయన సూచనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో శివాజీ స్టేట్మెంట్లు వైరల్ అయ్యాయి. వివాదానికి కారణమయ్యాయి. దీనిపై మరోసారి పాత్రికేయులు ప్రశ్నలు సంధిస్తే శివాజీ సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ‘జై బాలయ్య’ అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.