బీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టేలా కాంగ్రెస్ వ్యూహం.. బీఆర్ఎస్‌ఎల్పీ చీలికపై ఫోకస్!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికార ‘హస్తం’ పార్టీలో చేరిపోయారు.
చేరిన వారిలో సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యేల వరకూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి్ంది. వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందా.. లేక ఆ తరువాత స్టార్ట్ చేయాలా ? అని దానిపై ఆరా తీస్తున్నది. చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్‌గా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేస్తున్నది. ఈ మూడు నెలల్లో సీఎం రేవంత్‌రెడ్డిని ఏడుగురు గులాబీ ఎమ్మెల్యేలు కలిశారు. వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేలా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
3 నెలల్లో 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ


గతేడాది డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు. ఈ రెండు మూడు రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు సీఎంతో మీట్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌కు ముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్‌రావు, మహిపాల్ రెడ్డి.. సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా ఎప్పుడో ఒకసారి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

జంపింగ్‌కు డజన్ మంది రెడీ?
ఇప్పటికిప్పుడు డజను మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు ధీమాగా చెబుతున్నారు. ‘ఫోన్ చేసి పిలిచిన అరగంటలోపు గాంధీభవన్ మెట్లు ఎక్కేందుకు సదరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు’ అని ఓ సీనియర్ మంత్రి జిల్లాల వారీగా పార్టీ మారే ఎమ్మెల్యేల సంఖ్యను వివరించారు. అయితే వారిని ఎప్పుడు చేర్చుకోవాలనే అంశంపై అధిష్టానం నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు జాయిన్ చేసుకుంటే రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే దానిపై ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

కేసీఆర్‌కు ఝలకిచ్చే ప్లాన్
మాజీ సీఎం కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కామెంట్స్ చేయడంపై ఏఐసీసీ లీడర్లు దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు రెడీగా ఉన్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. దీనితో బీఆర్ఎస్ బలహీన పడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు, లోకసభ ఎన్నికల్లో రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం.

బీఆర్ఎస్‌ఎల్పీ చీలికపై ఫోకస్

చట్టపరంగా 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే, పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సదరు పార్టీ ఎమ్మెల్యేలపై అన్హరత వేటు పడదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ మధ్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి చెందడంతో ఆ పార్టీ సంఖ్య 38కి చేరింది. ఇందులో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే,బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవచ్చు. ఈ సంఖ్య కోసమే కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.