Cooch Behar Trophy : కర్ణాటక యువ బ్యాటర్ సంచలన ప్రదర్శన.. ఒకే ఇన్నింగ్స్‌లో 404 నాటౌట్‌

Cooch Behar Trophy final : కూచ్ బెహార్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. దేశవాలీ క్రికెట్‌లో అండర్‌-19 స్థాయిలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దీన్ని నిర్వహిస్తూ ఉంటుంది.
తాజాగా నిర్వహించిన టోర్నీ ఫైనల్ మ్యాచులో కర్ణాటక బ్యాటర్ ప్రఖర్ చతుర్వేది 400 పైగా పరుగులతో అజేయంగా నిలిచాడు.


ముంబైతో జరిగిన మ్యాచులో 638 బంతులు ఎదుర్కొన్న చతుర్వేది 46 ఫోర్లు, 3 సిక్సర్లతో 404 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 79 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ మ్యాచులో 400 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఆయుష్ మత్రే (145) శతకం, సచిన్ వర్తక్ (73) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 380 పరుగులు చేసింది. ఆ తరువాత ప్రఖర్ చతుర్వేది తో పాటు హర్షిల్ ధర్మానీ (169), కార్తికేయ (72), కార్తిక్ (50), సమర్థ్‌ (55 నాటౌట్‌)లు రాణించడంతో కర్ణాటక తమ మొదటి ఇన్నింగ్స్‌ను 890/8 వద్ద డిక్లేర్ చేసింది.
నాలుగు రోజుల మ్యాచ్ సమయం ముగియడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే… మొదటి ఇన్నింగ్స్‌లో 510 పరుగుల ఆధిక్యం సాధించిన కర్ణాటక ట్రోఫీని ముద్దాడింది.