ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ అనగానే కళ్ళు జిగేల్ మనిపించే లైట్లు, గిఫ్ట్స్, స్వీట్స్, కేక్స్, శాంటా క్లాజ్ సంబరాలతో నిండిపోతుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ పండగ జరుపుకుంటారు కానీ కొన్ని దేశాల్లో మాత్రం డిసెంబర్ 25వ తేదీ ఇతర రోజుల్లాగే చాలా సాదాసీదాగా ఉంటుంది.
ఎందుకంటే అక్కడ క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు/నిషేధాలు ఉంటాయి. రాజకీయ కారణాలు లేదా మతపరమైన సంప్రదాయాల వల్ల ఈ దేశాలు ఇప్పటికి క్రిస్మస్‌కు దూరంగా ఉంటున్నాయి.
క్రిస్మస్ జరుపుకోని ఆ 5 దేశాలు ఇవే:
1. సౌదీ అరేబియా
ఇస్లాం పుట్టిన దేశం అయిన సౌదీ అరేబియాలో క్రిస్మస్ వేడుకలు బహిరంగంగా జరుపుకోవడంపై నిషేధం ఉంది. వీధుల్లో డెకరేషన్స్ చేయడం, పండుగ జరుపుకోవడం ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ ఉండే క్రైస్తవులు ఎవరికీ తెలియకుండా వారి ఇళ్లల్లోనే ప్రైవేట్‌గా పండుగ చేసుకుంటారు. అయితే ఈ కాలంలో కొన్ని మాల్స్, అంతర్జాతీయ సంస్థల్లో చిన్నగా అలంకరణలు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పటికీ బహిరంగ వేడుకలపై చాలా ఆంక్షలు ఉన్నాయి.
2. సోమాలియా
సోమాలియాలో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ దేశంలో క్రిస్మస్ జరుపుకోవడం వల్ల ఇస్లాం సంప్రదాయాలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా ఉగ్రవాద ముప్పుల దృష్ట్యా భద్రతా కారణాలతో కూడా ఈ పండుగను జరుపుకోనివ్వరు. కనీసం ఒకరికొకరు మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కూడా అక్కడ కష్టమే.
3. బ్రూనై
చమురు నిల్వలు ఎక్కువగా ఉండే చిన్న దేశం అయిన బ్రూనైలో షరియా చట్టం అమలులో ఉంది. ముస్లిమ్స్ కానీ వారు వాళ్ళ ఇంటి లోపల పండుగ జరుపుకోవచ్చు, కానీ బయట మాత్రం క్రిస్మస్ చెట్లు పెట్టడం, లైట్లు కట్టడం లేదా శాంటా టోపీలు ధరించడం వంటివి చేస్తే కఠినమైన జరిమానాలు విధిస్తారు. ఇక్కడ మతపరమైన నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
4. ఉత్తర కొరియా
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు ఉండే దేశం ఉత్తర కొరియా. ఇక్కడ ఏ రకమైన మతపరమైన వేడుకలకి అనుమతి ఉండదు. క్రిస్మస్ పండగని ప్రభుత్వ అధికారానికి ముప్పుగా ఇక్కడి నాయకులు భావిస్తారు. ఎవరైనా దొంగచాటుగా క్రిస్మస్ జరుపుకుంటూ పట్టుబడితే జైలు శిక్ష లేదా అంతకంటే కఠినమైన శిక్షలు విధిస్తారు. వీరికి క్రిస్మస్ కంటే దేశాధినేతల పుట్టినరోజులే పెద్ద పండుగలు.
5. తజికిస్తాన్
ఇక్కడ క్రిస్మస్ పూర్తిగా నిషేధం కాకపోయినా, పండుగ జరుపుకోకుండా ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెడుతుంది. స్కూల్స్ లో గిఫ్ట్స్ పంచడం, క్రిస్మస్ చెట్లు పెట్టడం లేదా పటాకులు కాల్చడం వంటివి నిషేధించారు. సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇలాంటి విదేశీ పద్ధతులకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం చెబుతుంటుంది.


































