రాత్రి వండిన అన్నం మిగలడం కామన్. ఇక ఆ అన్నాన్ని ఉదయాన్నే పిల్లలకు పెడితే ముఖం చిట్లించుకుంటారు. దీంతో చేసేది ఏమీ లేక చద్దన్నాన్ని అమ్మలు తినడమో లేదంటే తాలింపు వంటివి వేయడమో చేస్తుంటారు. అయితే మిగిలిన అన్నంతో ఎప్పుడూ తాలింపు అంటే కష్టమే. అందుకే ఈసారి రైస్ ఉన్నప్పుడు కరకరలాడే పకోడీలు చేసుకోండి. మీరు విన్నది నిజమే, మిగిలిన అన్నంతో క్రిస్పీగా పకోడీలు చేసుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఇవి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ప్రిపేర్ చేసుకోవడం కూడా సులువే. మరి లేట్ చేయకుండా క్రంచీ అన్నం పకోడీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- అన్నం – 1 కప్పు
- ఉల్లిపాయలు – 2
- పచ్చిమిర్చి – 4
- కరివేపాకు – 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు – కొద్దిగా
- జీలకర్ర – 1 టీస్పూన్
- ఉప్పు – సరిపడా
- కారం – అర టీస్పూన్
- ధనియాల పొడి – 1 టీస్పూన్
- పసుపు – చిటికెడు
- శనగపిండి – 1 కప్పు
- బియ్యప్పిండి – 2 టేబుల్‌స్పూన్లు
-
తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి మిగిలిన అన్నం తీసుకుని చేతితో మెదుపుతూ మెత్తగా చేసుకోవాలి. అన్నం మెత్తగా అయిన తర్వాత పక్కన పెట్టాలి.
- ఈలోపు పకోడీకి అవసరమైన ఉల్లిపాయలను సన్నగా, పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
- మెత్తగా చేసుకున్న అన్నంలోకి కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి అన్నీ కలిసేలా ఓసారి మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత శనగపిండి, బియ్యప్పిండి వేసి కలుపుకోవాలి. నార్మల్‌గా పిండిని పకోడీలుగా కలపడానికి వాటర్ అవసరం లేదు. ఒకవేళ పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే చేతిని కాస్త తడి చేసుకుని కలుపుకుంటే సరి. పిండిని పకోడీలు వేసుకునేందుకు అనువుగా కలిపి పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పకోడీల మాదిరి నూనెలో వేసుకోవాలి.
- కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- మిగిలిన పిండిని కూడా పకోడీలుగా వేసుకుని ఎర్రగా వేయించి ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ క్రంచీ అన్నం పకోడీలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
చిట్కాలు:
- అన్నం పలుకుగా ఉంటే నూనెలో వేసినప్పుడు విచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మెత్తగా మెదుపుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ మీకు చేతితో మెదపడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీజార్‌లో వేసి మెత్తగా మెదుపుకుంటే సరిపోతుంది.
- అన్నం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో, అదే కప్పు కొలత ప్రకారం శనగపిండి తీసుకోవాలి. అప్పుడే బైండింగ్‌కు చక్కగా ఉండి పకోడీలు రుచికరంగా వస్తాయి.
































