ఈవెనింగ్ స్నాక్‌గా చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో ఒకటి మసాలా వడ. వీటినే కొన్ని ప్రాంతాల్లో “గారెలు” అని కూడా పిలుస్తుంటారు. అయితే, నార్మల్‌గా వీటిని ఎక్కువ మంది శనగపప్పు, మినప్పప్పుతో చేసుకుంటుంటారు. అలాకాకుండా ఒకసారి సగ్గుబియ్యంతో ఇలా “మసాలా వడలు” ట్రై చేయండి. బంగాళదుంపలు ఉడికించకుండానే అప్పటికప్పుడు ఈ వడలను సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండి ఎంతో రుచికరంగా ఉంటాయి. నూనె కూడా తక్కువగానే పీల్చుకుంటాయి! వీటిని స్నాక్గానే కాకుండా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి రెడీ చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఈ కరకరలాడే సగ్గుబియ్యం వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- సగ్గుబియ్యం – రెండు కప్పులు
- పల్లీలు – ఒక కప్పు
- అల్లం – రెండించుల ముక్క
- పచ్చిమిర్చి – నాలుగైదు
- కరివేపాకు – కొద్దిగా
- బంగాళదుంపలు – రెండు(మీడియం సైజ్‌వి)
- కారం – ఒక టీస్పూన్
- జీలకర్ర – ఒక టీస్పూన్
- సన్నని కొత్తిమీర తరుగు – కొద్దిగా
- ఉల్లిపాయలు – రెండు
- బియ్యప్పిండి – ఆరేడు టేబుల్‌స్పూన్లు
- నూనె – వేయించడానికి సరిపడా
-
తయారీ విధానం :
- ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ తయారీ కోసం ముందుగా ఒక గిన్నెలో కాస్త లావుగా ఉండే సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడగాలి.
- తర్వాత అందులో రెండు కప్పుల నీళ్లు పోసి నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- నాలుగైదు గంటల తర్వాత సగ్గుబియ్యం నీటిని పీల్చుకుని చక్కగా నాని, పొడి పొడిగా తయారవుతాయి.
- అనంతరం స్టవ్ మీద పాన్‌లో పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్‌లో మూడ్నాలుగు నిమిషాల పాటు వేయించాలి.
- పల్లీలు మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దింపి చల్లార్చుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత అందులో చల్లారిన పల్లీలను వేసి పల్స్ ఇస్తూ మెత్తగా కాకుండా పల్లీలు బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
- అనంతరం బంగాళదుంపలను పీలర్‌తో చెక్కు తీసుకుని గ్రేటర్‌తో సన్నగా తురుముకుని వాటర్ పిండేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, మిక్సీ పట్టిన పల్లీల మిశ్రమం, సన్నని ఆలూ తురుము, రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి.
- అలాగే, వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, బియ్యప్పిండిని యాడ్ చేసుకుని వాటర్ వేయకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా పిండిని మూడ్నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత మంటను తగ్గించి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ ముందు ఉండలా చేసి ఆపై చేతి మీద మసాలా వడలా వత్తుకుని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
- పాన్‌లో వేయించడానికి సరిపడా వేసుకున్నాక స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వెంటనే టర్న్ చేయకుండా కాసేపు వేగనిచ్చి ఆ తర్వాత అటు ఇటు తిప్పేసుకుంటూ క్రిస్పీగా, మంచి కలర్లో వచ్చే వరకు వేయించాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని కాసేపు ఉంచి ఆపై వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, ఆలూ ఉడికించకుండానే సగ్గుబియ్యంతో కరకరలాడే “మసాలా వడలు” రెడీ అవుతాయి!
- ఇక వీటిని గ్రీన్ చట్నీ లేదా టమాటా సాస్‌తో సర్వ్ చేసుకుని తిన్నారంటే ఆ టేస్ట్ వేరే లెవల్లో ఉంటుంది.
- ఈ రెసిపీ కోసం సగ్గుబియ్యం తీసుకున్న కప్పునే పల్లీలు, ఇతర ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి వాడుకోవాలి. అప్పుడే సరైన కొలతలతో మసాలా వడలు మంచి రుచికరంగా వస్తాయి.
































