తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను రక్షించుకోవడానికి ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ఫోటో, పేరు వాడుతున్నారు అని కోర్టును ఆశ్రయిస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
ఎన్టీఆర్ ఫిర్యాదు మేరకు.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ-కామర్స్ సంస్థలు అనధికారంగా ఆయన ఫోటోలు, సమాచారం ఉపయోగిస్తున్నాయి. ఇది ఆయన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించబడుతున్నాయని అని ఆయన పేర్కొన్నారు.
దీనిపై విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు, జూనియర్ ఎన్టీఆర్ హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పింది. సోషల్ మీడియా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఐటీ చట్టం 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కి వాయిదా వేసింది. ఆ రోజు కోర్టు సవివరమైన ఆదేశాలను జారీ చేస్తుందని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా తెలిపారు.
ఇటీవల కూడా చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖులు ఇలాగే హైకోర్ట్‌ను ఆశ్రయించి, తమ అనుమతి లేకుండా ఫోటో, వీడియోలు, పేరు వాడరాదు అని కోర్టు ఆదేశాలు తీసుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే రీతిలో తన హక్కులను కాపాడుతున్నారు.
సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా రాబోయే ఏడాది విడుదలకు సిద్దమవుతోంది. అలాగే, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లకు త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులతో వ్యవహరించనున్నట్లు సమాచారం.

































