పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.3 లక్షల లంచం తీసుకుంటూ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
క్యాటరింగ్ బిల్లులను ఆమోదించినందుకు మురళి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రూ .30 లక్షల విలువైన క్యాటరింగ్ బిల్లులను క్లియర్ చేసినందుకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. అయితే సదరు కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు… పక్కా ప్లాన్ వేశారు. లంచం డబ్బులను తీసుకునే క్రమంలో రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు మహీందర్ మాట్లాడుతూ… 2023లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న వారికోసం 41,000 భోజన పార్శిళ్లను సాగరమాత క్యాటరింగ్ సర్వీసెస్ అందించింది. ఇందుకోసం బిల్లులు సుమారు రూ.37 లక్షలు. రూ.10 లక్షలు అడ్వాన్స్ గా ఇవ్వగా…. మిగిలిన రూ.26 లక్షలకు చెక్కు విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన చెక్కును ప్రాసెస్ చేసేందుకు పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి ఏకా మురళి డిమాండ్ చేసి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారు.
“అతను లంచం తీసుకుంటుండగా మా బృందం అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మా ఉన్నతాధికారుల మార్గదర్శకాల మేరకు రైడ్ చేయబడింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది” అని ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు మహీందర్ పేర్కొన్నారు.


































