Hyderabad Vs Amaravati: అమరావతి అభివృద్ధితో హైదరాబాద్ లో తగ్గనున్న ధరలు.. !

www.mannamweb.com


Hyderabad Vs Amaravati: అమరావతి అభివృద్ధితో హైదరాబాద్ లో తగ్గనున్న ధరలు.. !

హైదరాబాద్ 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరం. ఆ తర్వాత భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తోంది. ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

అప్పటి సీఎంగా చంద్రబాబు ఐటీని హైదరాబాద్ లో శరవేగంగా విస్తరించారు. ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చెపట్టారు.

చంద్రబాబు ఏపీకి కొత్త రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశారు. ఎన్నో భవనాలకు శంకుస్థాపన చేశారు. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా అభివృద్ధి కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో అక్కడ మూడు రాజధానుల అంశం తెర పైకి వచ్చింది. దీంతో అక్కడ ఉపాధి తగ్గింది. దీంతో చాలా మంది ఏపీ ప్రాంతవాసులు హైదరాబాద్ కు వచ్చారు. గత 10 ఏళ్లలో ఏపీ నుంచి 3 లక్షల 40 ఎల్పీజీ గ్యాస్ తెలంగాణకు మారాయి. అంటే చాలా మంది ఏపీ వారు తెలంగాణకు వచ్చారు.

దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భారీగా పెరిగింది. సామాన్యులు ఇళ్లు కొనలేని స్థాయికి వెళ్లింది. ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతి అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో రియల్ భూం భారీగా పెరిగింది. అందుకే పెట్టుబడిదారులు అమరావతి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అనుకున్న స్థాయిలో అమరావతిని అభివృద్ధి చేస్తే హైదరాబాద్ లో ఇళ్లు, భూముల ధరలు తగ్గే అవకాశం ఉంది.

హైదరాబాద్ లో ఇళ్లు, భూముల ధరలు 10 నుంచి 15 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఒత్తిడి తగ్గించాల్సి బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది. హైదరాబాద్ కాకుండా కరీంనగర్, వరంగల్ నగరాలను అభివృద్ధి చేస్తే హైదరాబాద్ లో సామాన్యులకు ఇళ్ల ధరలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఇళ్ల అద్దెలు కూడా భారీగానే ఉన్నాయి. త్వరలో ఈ ఇళ్ల అద్దెలు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రకారం, 2015, 2023 మధ్య హైదరాబాద్‌లో భూముల ధరలు 10 రెట్లు పెరిగాయి. ఎన్‌రాక్‌ డేటా ప్రకారం గత మూడేళ్లలో హైదరాబాద్‌లో భూముల ధరలు 30 శాతానికి పైగా పెరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, అమరావతి వంటి నగరాల్లో భూముల ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అప్పట్లో అమరావతి ప్రాజెక్టు నిలిచిపోవడమే. ఇప్పుడు పరిస్థితులు మరోసారి మారాయి. అమరావతి మొదటి దశ పనులను 30 నెలల్లో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొదటి దశలో ఐఏఎస్ ఆఫీసర్ కాలనీ, సెక్రెటరీ, ఎమ్మెల్యే కాలనీ రెడీ అవుతుందని, దాదాపు 10 వేల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండేందుకు రానున్నాయని, అంటే 40 నుంచి 50 వేల మంది ఇక్కడ నివసించేందుకు వస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమరావతిలో చాలా స్థలం అందుబాటులో ఉందని, హైదరాబాద్‌తో పోలిస్తే దీని ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, దీంతో టీడీపీ గెలుపు ఖాయమనే ఉద్దేశంతో పెట్టుబడిదారులు ఇక్కడికి క్యూ కట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్ లో రియల్టీ రంగంలో భూముల ధరలు 10 నుంచి 15 శాతం వరకు తగ్గవచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు.