థైరాయిడ్ రిపోర్ట్ బోర్డర్‌లైన్ అని వచ్చిందా? కంగారు పడకండి.. తెలుసుకోవాల్సినవివే

థైరాయిడ్ పరీక్షలో ఫలితాలు ‘బోర్డర్‌లైన్’ అని వస్తే వెంటనే మందులు వాడాల్సిన పనిలేదు. అది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చదవండి.

చాలామంది థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు రిపోర్ట్‌లో రీడింగ్స్ ‘నార్మల్’ కు కొంచెం అటుఇటుగా అంటే ‘బోర్డర్‌లైన్’ లో వస్తుంటాయి. ఇలా రాగానే ఏదో పెద్ద అనారోగ్యం వచ్చేసిందని, జీవితాంతం మందులు వాడాలేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ, బోర్డర్‌లైన్ రిపోర్ట్ వచ్చిన ప్రతిసారీ మందులు అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఏమిటీ ‘బోర్డర్‌లైన్’ థైరాయిడ్?

వైద్య పరిభాషలో దీనిని ‘సబ్ క్లినికల్ హైపో థైరాయిడిజం’ (Subclinical Hypothyroidism) అంటారు. దీని అర్థం.. మీ రక్తంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) స్థాయిలు స్వల్పంగా పెరిగాయని, కానీ థైరాక్సిన్ (T4) హార్మోన్ మాత్రం సాధారణ స్థితిలోనే ఉందని అర్థం.

“బోర్డర్‌లైన్ రిపోర్ట్ రాగానే థైరాయిడ్ వ్యాధి ఉన్నట్లు కాదు. ఇది కేవలం మీ ఆరోగ్యాన్ని మరింత నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పే ఒక సంకేతం మాత్రమే,” అని మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ ల్యాబ్ ఆపరేషన్స్ చీఫ్ డాక్టర్ సుభాశిష్ సాహా వివరించారు.

ఫలితాలు మారడానికి కారణాలేంటి?

కేవలం అనారోగ్యం వల్లే కాకుండా, రోజువారీ అలవాట్ల వల్ల కూడా థైరాయిడ్ రీడింగ్స్‌లో మార్పులు రావచ్చు:

ఒత్తిడి, నిద్రలేమి: సరిగ్గా నిద్ర లేకపోయినా లేదా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా రీడింగ్స్ మారవచ్చు.

ఇన్ఫెక్షన్లు: ఏదైనా జబ్బు నుంచి కోలుకుంటున్న సమయంలో పరీక్ష చేయించుకుంటే ఫలితాలు బోర్డర్‌లైన్ వచ్చే అవకాశం ఉంది.

మందులు: స్టెరాయిడ్స్ లేదా కొన్ని రకాల ఇతర మందులు వాడుతున్నప్పుడు కూడా ప్రభావం ఉంటుంది.

వ్యాయామం: తీవ్రమైన శారీరక శ్రమ చేసిన వెంటనే పరీక్ష చేయించుకోవడం కూడా ఫలితాలను ప్రభావితం చేస్తుంది.

కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి?

చాలామందిలో ఎటువంటి లక్షణాలు ఉండవు. అయితే కొందరిలో కింది సమస్యలు కనిపించవచ్చు:

  • ఎప్పుడూ అలసటగా అనిపించడం.
  • కారణం లేకుండా బరువు పెరగడం.
  • మలబద్ధకం, మానసిక ఆందోళన లేదా నిరాశ.
  • జుట్టు, చర్మం పొడిబారడం.
  • ఏకాగ్రత తగ్గడం, మహిళల్లో నెలసరి సమస్యలు.

ముఖ్య గమనిక: విటమిన్ లోపం లేదా రక్తహీనత ఉన్నా కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి, కేవలం ల్యాబ్ రిపోర్ట్ చూసి థైరాయిడ్ అని నిర్ధారించుకోకూడదు.

చికిత్స ఎప్పుడు అవసరం?

బోర్డర్‌లైన్ రిపోర్ట్ రాగానే మందులు మొదలుపెట్టడం వల్ల కొన్నిసార్లు అనవసరమైన దుష్ప్రభావాలు (గుండె వేగం పెరగడం, ఆందోళన, ఎముకల బలహీనత) కలగవచ్చు. అందుకే వైద్యులు సాధారణంగా 6 నుంచి 8 వారాల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోమని సూచిస్తారు. ఒకవేళ రెండోసారి కూడా ఫలితాలు అలాగే ఉంటే, అప్పుడు మాత్రమే చికిత్స గురించి ఆలోచిస్తారు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

  • గర్భిణీ స్త్రీలు లేదా గర్భం దాల్చాలనుకునే వారు.
  • గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు.
  • కుటుంబంలో థైరాయిడ్ చరిత్ర ఉన్నవారు.

ల్యాబ్ రిపోర్ట్‌లోని అంకెలను చూసి మీ అంతట మీరు మందులు వాడకండి. మీ వయస్సు, లక్షణాలు, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్ ఇచ్చే సలహా మాత్రమే పాటించండి.

(గమనిక: ఈ వ్యాసం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.