మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే వేడి వేడి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇది వారి దినచర్యలో ఒక భాగం. చాలామందికి, ఈ పానీయాలు లేకుండా రోజు మొదలుకాదు, ఎలాంటి పని చేయలేమనిపిస్తుంది.
అందుకే, ఉదయం లేవగానే ఒక కప్పు టీ తప్పకుండా తాగాలని మనకు మనం ఒక నియమాన్ని పెట్టుకుని, దానిని క్రమం తప్పకుండా పాటిస్తుంటాం. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, మీరు నిత్యం పాటిస్తున్న ఈ అలవాటు వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే ఆరోగ్య సమస్యలు:
మెటబాలిజంపై ప్రభావం: సాధారణంగా నిద్ర లేచిన తర్వాత శరీరంలోని క్షారత్వం, ఆమ్లత్వం స్థాయిలు కొంతవరకు అస్తవ్యస్తంగా ఉంటాయి. ఇది మామూలే. అయితే, ఇలా నిద్ర లేవగానే వేడి టీ తాగడం వల్ల ఈ స్థాయిలపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది మెటబాలిజం ప్రక్రియను నెమ్మదిస్తుంది. కాలక్రమేణా, ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
దంత సమస్యలు: ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల పళ్ళపై ఉండే పొర (ఎనామెల్) అరిగిపోయి, దంత సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతుంది.
జీర్ణ వ్యవస్థకు ప్రమాదం: ఉదయం ఖాళీ కడుపుతో వేడి టీ తాగడం జీర్ణవ్యవస్థకు మరింత ప్రమాదకరం. ఇది జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
చిన్న పిల్లలకు టీ అస్సలు ఇవ్వకూడదు:
చిన్న పిల్లలకు ఉదయం నిద్ర లేవగానే టీ ఇవ్వకూడదు. పిల్లలు మారాం చేస్తారని లేదా మీరు తాగేటప్పుడు అలవాటు చేస్తారని వారికి టీ ఇవ్వకండి. ఈ అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దశలవారీగా పాడుచేస్తాయి. వారి జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి, టీలోని కెఫిన్, టానిన్లు వారికి మంచివి కావు.
టీ ఎప్పుడు తాగితే మంచిది?
కాబట్టి, ఇకపై ఖాళీ కడుపుతో ఉదయం వేడి టీ తాగే అలవాటును మానుకోవడం మంచిది. అలాగే, భోజనం చేసిన వెంటనే టీ తాగడం కూడా చాలా చెడ్డ అలవాటు. భోజనం తర్వాత నిద్ర వస్తుందని చాలా మంది వెంటనే టీ తాగుతారు. కానీ, ఈ అలవాటు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. బదులుగా, మీరు అల్పాహారం చేసిన తర్వాత లేదా సాయంత్రం వేళల్లో స్నాక్స్ తో పాటు టీ లేదా కాఫీ వంటి పానీయాలను తాగవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.
































